Kharge | దేశ రాజ్యాంగం నుండి లౌకిక పదాన్ని తీసేయాలని బీజేపీ చూస్తున్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలోనే లేదని చెప్పే దుస్సాహసం చేస్తున్నదని అన్నారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని ఎవరూ తీసేయలేరని తేల్చి చెప్పారు. ఈ పదంతో బీజేపీకి ఇబ్బంది ఉంటే ముందు వారి పార్టీ ప్రణాళిక నుంచి తొలగించాలని సవాలు విసిరారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్నిఇంటింటికి తీసుకెళ్లాలని ఖర్గే పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరి సభలో ఖర్గే మాట్లాడారు. కార్యకర్తల కృషితోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కేసీఆర్ కాకుండా ఇంకో పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదని బీఆరెస్ నేతలు ప్రచారం చేసుకున్నారని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలోనూ తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ కలలు కన్నదన్న ఖర్గే.. ఆ రెండు పార్టీల ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టి, కష్టపడి పనిచేసి, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని ప్రశంసించారు. రాహుల్ పాదయాత్ర సమయంలోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమైందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నకేంద్ర ప్రభుత్వ సంస్థలను గత కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు మోదీ చేసింది ఏంటో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.
అఖిలపక్షానికంటే ఎన్నికల ప్రచారం ముఖ్యమా?
పహల్గాం ఉగ్రవాద ఘటనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. దానికి ప్రధాని మోదీ హాజరుకాకుండా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఖర్గే మండిపడ్డారు. మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్‌ను ఇది చేస్తాం, అది చేస్తాం అన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఏమీ చేయలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్‌పై యుద్ధం చేయకుండా ఎవరు ఆపారని నిలదీశారు. క్షమాపణ చెప్పడమే బీజేపీ, ఆరెస్సెస్‌లకు తెలిసిన పని అని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌పై చర్యలకు మోదీ భయపడ్డారన్న ఖర్గే.. గతంలో ఇందిరాగాంధీ భయపడలేదని, ఎవరు వచ్చినా బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం కల్పించి తీరుతామని చెప్పారని గుర్తు చేశారు.
నాడు అమ్ముకునే బియ్యం.. నేడు తినే బియ్యం
తెలంగాణలో కాంగ్రెస్ ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు పథకం, పేదలకు సన్న బియ్యం ఇస్తున్నదని ఖర్గే చెప్పారు. గత ప్రభుత్వం అమ్మే బియ్యం ఇచ్చేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ దేశానికి ఆదర్శం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తాము చెప్పినవన్నీ ఇచ్చి చూపించామని స్పష్టం చేశారు. కొందరు అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతారని, తాము అభివృద్ధి, సంక్షేమం చేసి ఓట్లు అడుగుతామని ఖర్గే తెలిపారు. తెలంగాణలో విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్న ఖర్గే.. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి ఉండేదని, కాంగ్రెస్ వచ్చాక అవినీతి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.