విధాత : కృష్ణా నది( Krishna River)పై తెలంగాణ (Telangana) కడుతున్న ప్రాజెక్టుల(Nnew projects)ను అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ( AP Government ) ప్రభుత్వం లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 16 కొత్త ప్రాజెక్టులు నిర్మించేందుకు డీపీఆర్ తయారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 16వ తేదీన జీవో విడుదల చేసింది.
ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ 42 కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని, సీడబ్యూసీ, అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రానికి ఏపీ జలవనరుల శాఖ లేఖ రాసింది.
తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని, ఈ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడని లేఖలో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.
మరోవైపు ఏపీ ప్రతిపాదించిన పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రాజెక్టును కొంత మార్పు చేసి పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుగా తెరపైకి తేవడం జరిగింది.
