Site icon vidhaatha

HYDERABAD | పోలీస్ పహారాలో అశోక్ నగర్‌ … నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తం

విధాత, హైదరాబాద్ : గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తోన్న ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రూప్-2 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగులు శనివారం రాత్రి ఆకస్మిక ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని నగర కేంద్ర గ్రంథాలయం నుంచి నిరుద్యోగులు చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సమాచారం ముందస్తుగా తెలియకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి చిక్కడపల్లిలోని గ్రంథాలయం పరిసరాల్లో మఫ్టిలో పోలీసు సిబ్బందితో వాహనాలతో పహారా ఏర్పాటు చేశారు. అశోక్ నగర్ క్రాస్ రోడ్డులో కూడా నిఘా ఉంచారు. అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకుల కదలికలపై నిఘా కొనసాగిస్తున్నారు.

Exit mobile version