Azharuddin : అజహరుద్దీన్‌కు మంత్రి పదవిపై విభేదాలు?

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడిన మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా సీనియర్ నేత షబ్బీర్ అలీ అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

Mohammed Azharuddin Minister post Congress internal rif

విధాత, హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడిన మహ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి విషయమై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ సాగుతుంది. అధిష్టానం ఆమోదంతో సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ విస్తరించాలని..మైనార్టీకోటాలో అజారుద్ధీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం శుక్రవారం ముహుర్తంగా నిర్ణయించి గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గంలో నిర్ణయాత్మక సంఖ్యలో ఉన్న మైనార్టీలను ఆకట్టుకునే వ్యూహంతో కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అయితే పార్టీలో సీనియర్ గా ఉన్న తనను కాదని అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ గుర్రుగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఇప్పటికే షబ్బీర్ అలీ ముస్లిం మత పెద్దలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన అసంతృప్తిని వెళ్లగక్కారని, కాంగ్రెస్ హైకమాండ్ వద్ధకు కూడా ఈ పంచాయతీని తీసుకెళ్లారని తెలుస్తుంది.

చర్చనీయాంశమైన పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు సంబంధించిగాని.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఫైనల్ అయినట్లుగాని నాకు సమాచారం లేదని పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. అజారుద్దీన్ మంత్రి పదవిపై టీవీలో వస్తున్న సమాచారమే కానీ మాకు అధిష్టానం నుండి ఎలాంటి సమాచారం లేదు అని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజార్ ను ప్రతిపాదించినందునా ఆయనకు మంత్రిగా అవకాశం వస్తుండవచ్చని అనుకున్నామని, శుక్రవారం కేబినెట్ విస్తరణ ఏర్పాట్లపై మాత్రం ప్రస్తుతానికి నాకు సమాచారం లేదని మహేష్ గౌడ్ చెప్పిన తీరు కూడా కేబినెట్ విస్తరణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ లో విబేధాలకు నిదర్శనంగా కనిపించింది. మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ లో నామినెట్ కాబడిన కోదండరామ్, అజారుద్దీన్ ల పేర్లకు గవర్నర్ ఇప్పటిదాకా ఆమోదం తెలుపలేదు. ఇప్పటికే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతుంది. అసెంబ్లీ, మండలిలో సభ్యుడు కాని అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే…ఆయన 6నెలలలోపుగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం తప్పనిసరి. లేదంటే నిబంధనల మేరకు ఆయన మంత్రి పదవి నుండి వైదొలగాల్సివస్తుంది. ఈ నేపథ్యంలో అజారుద్ధీన్ మంత్రి పదవి వ్యవహారం కాంగ్రెస్ లో కాక రేపుతుంది.

తదుపరి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చాన్స్

మరోవైపు రేపు కేబినెట్ విస్తరణ జరిగి అజారుద్ధీన్ మంత్రివర్గంలో చేరితే తెలంగాణ మంత్రివర్గం సంఖ్య 16కు చేరుతుంది. రాష్ట్ర మంత్రివర్గం సంఖ్య సీఎం సహా 18మందికి పరిమితం. మిగిలిన రెండు మంత్రి పదవుల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ లతో పాటు ఎస్టీ కోటా నుంచి బాలునాయక్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా..లేదా అన్న చర్చకూడా ఆసక్తికరంగా మారింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక..ప్రస్తుత మంత్రివర్గంలోని నలుగురు మంత్రులను తొలగించే చాన్స్ ఉందన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ ధఫా మంత్రివర్గ విస్తరణ కాకుండా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేస్తారని..తద్వారా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయన్న చర్చ బలంగా సాగుతుంది.