మేడిగ‌డ్డ కుంగ‌డం దోపిడీకి నిద‌ర్శ‌నం: బ‌క్క జ‌డ్స‌న్‌

విధాత‌, హైద‌రాబాద్‌: కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో రీడిజైన్ పేరుతో, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మాణం చేప‌ట్టి కోట్లాది రూపాయ‌లు దోచుకున్నారడానికి నిద‌ర్శ‌న‌మే మేడిగడ్డ బ‌రాజ్‌లో 20వ పిల్ల‌ర్ కుంగ‌డ‌మ‌ని ఏఐసీసీ స‌భ్యులు బ‌క్క జ‌డ్స‌న్ ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కోట్ల రూపాయలను దుబారా చేశార‌ని ఆరోపిస్తూ.. మంగ‌ళ‌వారం హుస్సేన్ సాగర్ లో రాష్ట్ర ప్రభుత్వానికి పిండ ప్రదానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలను బీఆరెస్ ప్ర‌భుత్వం ఆగమ్య గోచరంగా చేసిందన్నారు. బంగారు తెలంగాణ పేరుతో సుమారు 10 ఏళ్లుగా మోసం చేశారన్నారు. మాటల గారడీతో నాడు తెలంగాణ ఉద్యమంలో సుమారు 1200 మంది విద్యార్థులను బలి కొన్నారని, నేడు తెలంగాణ ప్రజల ఆస్తులను, ప్రజాధనాన్ని బీఆరెస్‌ ప్రభుత్వం దోచుకుంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్మించిన‌ నాగార్జునసాగర్ వంటి ఎన్నో ప్రాజెక్ట్‌లు నేటికీ మన కళ్ళ ముందు పటిష్టంగా కనపడుతున్నాయన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో ఈ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నదని సీబీఐ, ఈడీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ త‌దిత‌ర‌ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేద‌న్నారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆరెస్‌ రెండూ కలిసికట్టుగా, వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రజల‌ ధనాన్ని, ఆస్తులను దోచుకుంటున్నారనడానికి నిదర్శనమన్నారు. ఈ ప్రభుత్వానికి ఈసారైనా తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ ఆలోచించాలని పిండ ప్రదానం చేశానని తెలిపారు.

Latest News