DHARANI। ధరణిలో రైతు సమస్యలకు పరిష్కారం ఎన్నడో…?

క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సూచనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న పౌర సమాజం ఇటీవల సీఎస్‌కు కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ వినతి పత్రం DHARANI । ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చిన మూడేళ్లు కావస్తున్నా… ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రైతులకు చెందిన వ్యవసాయ భూములు దాదాపు 40 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. దాదాపు 10 లక్షల ఎకరాల పట్టా భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని ఒక అంచనా…మరి కొన్ని భూములు నోషనల్‌ […]

  • Publish Date - March 3, 2023 / 09:50 AM IST

  • క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సూచనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న పౌర సమాజం
  • ఇటీవల సీఎస్‌కు కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ వినతి పత్రం

DHARANI । ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చిన మూడేళ్లు కావస్తున్నా… ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రైతులకు చెందిన వ్యవసాయ భూములు దాదాపు 40 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. దాదాపు 10 లక్షల ఎకరాల పట్టా భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని ఒక అంచనా…మరి కొన్ని భూములు నోషనల్‌ ఖాతాలో ఉన్నాయి. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, అసైన్డ్‌ భూములుగా నమోదయ్యాయి. భూ యజమానులు తమ భూములు తమకు కాకుండా పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

విధాత: భూమి సమస్యలన్నీ ధరణి (Dharani)లో పరిష్కరించామని, అంతా అద్భుతంగా ఉందని తెలంగాణ సర్కారు (Government of Telangana) బయటకు చెపుతున్నా… వాస్తవంలో అనేక సమస్యలు అలాగే దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కరించండని ఎవరికి చెప్పుకోవాలో రైతులకు తెలియని పరిస్థితి ఏర్పడింది. అన్నింటికీ జిందాతిల్మత్‌ ఒక్కటే మందు అన్న తీరుగా ప్రతి సమస్యలకు మీ-సేవ (Mee Seva)లో దరఖాస్తు చేయాలన్న సమాధానం తప్ప అధికారుల నుంచి మరొకటి రావడం లేదు.

కింది స్థాయిలో తాసిల్దార్‌ నుంచి ఆర్డీవోల వరకు సమస్యలు పరిష్కరించే అధికారం ధరణి చట్టంలో లేదు. కలెక్టర్‌ అంబాబులో ఉండరు. మీ- సేవలో దరఖాస్తు చేస్తే చాలా సాధారణంగా రిజక్ట్‌ అనే మెసేజ్‌ తప్ప మరొకటి రావడం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం ఏ కారణం చేత రిజక్ట్‌ చేస్తున్నారో కూడ జవాబు ఇవ్వడం లేదంటున్నారు కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌.
క్యాబినెట్‌ సబ్‌కమిటీ నివేదిక ఎక్కడ?

ధరణి పోర్టల్‌ (Dharani Portal) లో సమస్యలున్నాయని గుర్తించిన సర్కారు ఎట్టకేలకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ (Cabinet Sub Committee) వేసింది. ఈ సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా మూలకు పడేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తన్నాయి. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసినా చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని పౌర సమాజం భావిస్తోంది.

అయితే ఆ దిశగా చర్యలు జరగడం లేదని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ అంటున్నారు. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చేసిన సూచనలు అమలు చేయాలని ఇటీవల ఆయన రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు ఆయా సమస్యలను నిర్దిష్టంగా సీఎస్‌ ముందుకు తీసుకువెళ్లారు.

ధరణిలో రైతులకు చెందిన వ్యవసాయ భూముల హక్కులకు సంబంధించిన సమస్యలు ఇవే..

  • ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, తప్పిదాల కారణంగా 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు (Agricultural Land) నిషేధిత జాబితాలో చేరింది. రైతుల చేతుల్లో పట్టాదారు పాస్‌ పుస్తకం (Pattadar Pass Book) ఉన్నా ఆ భూమి వివరాలు ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు. అసైన్డ్‌ భూముల (Assigned Lands) లావాదేవీలు నిలిచిపోవడం, సక్సెషన్‌ కాకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
  • 2007లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్‌ చట్టం 22(ఏ) ప్రకారం రూపొందించిన నిషేధిత జాబితాలో అనేక తప్పలు దొర్లాయి. అధికారులు చేసిన తప్పిదాల వల్ల దాదాపు 10 లక్షల ఎకరాల పట్టా భూమి నిషేధిత జాబితాలో చేరింది. ఈ సమస్యను పరిష్కరించకుండా అదే డాటాను ధరణి పోర్టల్‌లో అనుసంధానించారు.
  • అన్న దమ్ముల మధ్య వివాదాలుంటే.. వివాదంలో ఉన్న సర్వే నెంబర్‌లోని సబ్‌ డివిజన్‌ వరకు మాత్రమే కాకుండా మొత్తం సర్వే నెంబర్‌నే నిషేధిత జాబితాలో పొందు పరిచారు. అలాగే వివిధ ప్రాజెక్ట్‌ల కోసం రోడ్లు, రైలు, టీఎస్‌ఐఐసీ, సాగునీటి పారుదల శాఖ కాలువల కింద సేకరించిన భూమి (Land Acquisition) వరకు సబ్‌ డివిజన్‌ చేయకుండా మొత్తం సర్వే నెంబర్‌నే నిషేధిత జాబితాలో చేర్చారు. ఇలా పలుచోట్ల గ్రామాలకు గ్రామాల భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి భూముల సమస్యలు ఎక్కువగా ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మెదక్‌, వరంగల్‌ తదితర జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి.
  • స్వాతంత్ర్య సమర యోధులు, మాజీ సైనికులకు కేటాయించిన దాదాపు 2 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది. ప్రభుత్వం భూమిని ఇలాంటి క్యాటగిరీలకు చెందిన వారికి అసైన్డ్‌ చేసిన 10 ఏళ్ల తరువాత పూర్తి హక్కులు భూ యజమానులకే లభిస్తాయి. వీటిని ప్రొహిబిటెడ్‌ జాబితా (Prohibited Lands List) నుంచి తొలగించాలని 2007లోనే నాటి ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఈ భూములకు పూర్తి హక్కలు కల్పించే ఎన్‌ఓసీ (NOC) ఇచ్చే అవకాశం ధరణిలో లేదు. 2015లో హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిషేధిత భూముల జాబితా రూపక్పలనకు ముందు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి కానీ, అలా అభ్యంతరాలు స్వీకరించకుండానే పట్టా భూములను ప్రభుత్వ భూమిగా లెక్కించారు.
  • ధరణి పోర్టల్‌ నుంచి అకస్మాత్తుగా కొన్ని సర్వే నెంబర్లు మిస్‌ అవుతున్నాయి.. ప్రభుత్వం ఏదైనా భూమిని తీసుకోవాలంటే.. దానికి సంబంధించిన సర్వే నెంబర్లను ఉద్దేశ పూర్వకంగా తొలగిస్తున్నారన్న వాదనలున్నాయి. ఇది పెద్ద స్కామ్‌కు దారి తీసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 70 ఏళ్లుగా రూపొందించిన మాన్యువల్‌ రికార్డులను ధరణిలో పొందు పరుచక పోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
  • యజమానులు లేని భూముల జాబితాలో దాదాపు ౩ లక్షల ఎకరాలున్నాయి. వాటిని రైతులు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇవ్వకపోవడంతో అనేక మంది రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
  • తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నూతన పాస్‌పుస్తకాల్లో భూములున్నా కానీ, రెవెన్యూ అధికారుల పొరపాటు కారణంగా కొంత మంది రైతుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కలేదు. ఇదే సమయంలో ధరణి కంటే ముందు తప్పులు దొర్లాయని నిర్థారణ జరిగినా.. ధరణిలో వాటిని సరి చేసే అవకాశం లేకుండా పోయింది.

– పార్ట్‌-2 రేపు

Latest News