అప్పుల ఘనాపాఠి..మాటల మరాఠి కేసీఆర్‌

మాటల మరాఠి మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన అప్పుల ఘనాపాఠిగా చరిత్రలో నిలుస్తాడని పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ విమర్శించారు

  • Publish Date - December 15, 2023 / 01:27 PM IST

  • పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌

విధాత : మాటల మరాఠి మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన అప్పుల ఘనాపాఠిగా చరిత్రలో నిలుస్తాడని పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ విమర్శించారు. శుక్రవారం భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చివరకు వరంగల్‌ సెంట్రల్ జైలును సైతం బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర బ్యాంకులో కుదువ పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పదేళ్ల బీఆరెస్ నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలనతో విసుగెత్తి ప్రజాస్వామిక తిరుగుబాటుతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చుకున్నారన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 1200 మంది అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల అభీష్టం మేరకు పని చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. తాను త్వరలో జరుగబోయే ఉమ్మడి ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు తెలిపారు.


బీఆరెస్ పాలకులు చేసిన అక్రమాలపై అనేక కేసులు వేసి నిజ నిజాలను బయటికి తీసుకురావడంలో ప్రజలకు చేరవేయడంలో తాను ఎంతో పోరాటం చేసి, ప్రజలను చైతన్యవంతం చేశాననన్నారు. నిరుద్యోగుల గొంతును చట్టసభల్లో వినిపించేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, నాయకులు మద్దతు తెలిపాలని కోరారు. ఈ సమావేశంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్లు పోత్నర్ ప్రమోద్ కుమార్, ఈరపాక నరసింహ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, స్టాన్లీ, పిట్టల బాలరాజ్ తదితరులున్నారు.

Latest News