విధాత, హైదరాబాద్ : ఎవరి ప్రయోజనాల కోసమో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కట్టుకథలు రాయడం సరికాదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. సింగరేణి సంస్థ టెండర్లు నిర్వహించిన నైనీ బొగ్గు బ్లాక్ కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ‘‘బొగ్గు కోసం..నీచ కథనం’’ లో తన పేరు ప్రస్తావించడాన్ని భట్టి తప్పుబట్టారు. ప్రజా భవన్ లో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనపై వచ్చిన మీడియా కథనాన్ని ఖండించారు. సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తి అని, బొగ్గు గనులు ప్రజల ఆత్మ అని,
ప్రజల ఆస్తులను కాపాడటమే నా లక్ష్యం, నా పని అని భట్టి చెప్పుకొచ్చారు. అక్రమంగా వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించేందుకు నేను రాజకీయాల్లోకి రాలేదు అని, ఆస్తులను సంపాదించడం కోసం.. పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు అని, నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం అని భట్టి స్పష్టం చేశారు. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని పేర్కొన్నారు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను, ప్రజల ఆస్తులను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను అని భట్టి తెలిపారు.
టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ..మంత్రి కాదు
నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ అని, మంత్రి కాదని…టెండర్ల నిబంధనలను ఖరారు చేసేది ఆ సంస్థ అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. క్లిష్టతరమైన ప్రాంతాల్లో గనులుంటాయి కాబట్టి.. ఫీల్డ్ విజిట్ అనేది పెడతారు అని, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇటువంటి నిబంధనలు పెడతారు అని గుర్తు చేశారు. ఇటువంటి అంశాలపై వార్తలను సరైన సమాచారం తెలుసుకుని రాయాలన్నారు.
నేను దివంగత సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని అని, తనపై కోపంతో నా మీద వార్త కథనాలు రాసుండొచ్చు అని, దీనిపై నేను, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తేల్చుకుంటాం.. ప్రజలకు నిజానిజాలు తెలియాలని భట్టి చెప్పుకొచ్చారు. నేను ఈ బాధ్యతలో ఉన్నంతవరకు ఏ గద్దలను రానివ్వనని, మీకు ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు అని, మీ మధ్యలో ప్రజాప్రతినిధులను లాగొద్దు అని, మంత్రులు మధ్య విబేధాలు రేపాలనుకునే మీ ప్రయత్నాలు ఫలించబోవన్నారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు వెళ్లొద్దు అని, ఎవరి గురించి నీచ నికృష్ట పనులు చేయించే వీక్ క్యారెక్టర్ కాదు నాది కాదు అని భట్టి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసమే మా క్యాబినెట్ మొత్తం పని చేస్తుంది అని, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో సభలోపల, బయట సమాజం కోసం నిలబడి పోరాటం చేసిన వాడిననని, ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్లు రద్దు చేయాల్సిందిగా, తిరిగి కొత్తగా టెండర్లు పిలువాల్సిందిగా సింగరేణి సంస్థ బోర్డుకు సూచించాను అని భట్టి తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Assam Bagurumba dance| వరల్డ్ వండర్ ..అస్సామ్ లో 10వేల మంది డాన్స్ ప్రదర్శన
Keerthi | చిచ్చు రేపిన కీర్తి భట్ కామెంట్స్ .. డ్రెస్ జారిన డ్యాన్స్ చేయాలా?
