Site icon vidhaatha

BJP MLA Maheshwar Reddy | బోనస్‌ విషయంలో సీఎం పునఃసమీక్షించాలి: ఏలేటి

విధాత: కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్న వడ్లకే రూ. 500 బోనస్‌ ఇస్తామనడం దారుణమని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రమే సన్న బియ్యాన్నే పండిస్తారని, రాష్ట్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా రైతులు ఎక్కువగా దొడ్డు రకాలే పండిస్తారని తెలిపారు. సన్న బియ్యానికే బోనస్‌ ఇవ్వడం ఐదు శాతం మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుందన్నారు. బోనస్‌ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి పునఃసమీక్షించాలని కోరారు. రైతాంగానికి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.

గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత

అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాకా అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీజేవైఎం నాయకులు గన్ పార్కు వద్ద చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవల్ల మహేందర్ ఆధ్వర్యంలో బీజేవైఎం కార్యకర్తలు గన్ పార్కు అమర వీరుల స్థూపం వద్ద నిరసనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే క్రమంలో బీజేవైఎం కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట సాగింది. అతికష్టం మీద పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో స్టేషన్లకు తరలించారు.

Exit mobile version