విధాత, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఉద్యమం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఉద్యమం జూబ్లీహిల్స్ ఎన్నిక సందర్భంగా తెలంగాణకు పాకింది. అయితే తెలంగాణలో ఓట్ చోరీ ఉద్యమం చేస్తుంది మాత్రం కాంగ్రెస్ కాదు. రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావడం గమనార్హం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటర్ల జాబితాలతో డబుల్ ఓట్లు, దొంగ ను బయటపెడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. సుమారు 20,000 దొంగ ఓట్లు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఒక్కొక్క వ్యక్తికి చిన్న చిన్న అక్షరాలను మార్చి ఒకటే అడ్రస్ లో మూడు, నాలుగు గుర్తింపు కార్డులు ఉన్నాయని, 15 వేల ఓట్లు సరైన చిరునామాలు లేకున్నా ఓట్లు నమోదు చేసుకోవడం జరిగిందని, ఈ మొత్తం ఓటర్ లిస్టు అవకతవకల పైన పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది.
కొడంగల్ కు పాకిన ఓట్ల చోరీ
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ల చోరీ ఉద్యమం తెలంగాణలో ఆ పార్టీకే బూమ్ రాంగ్ అవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ ఆరోపిస్తున్న బీఆర్ఎస్..తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజవర్గం కొడంగల్ నియోజకవర్గంలోనూ ఓట్ల చోరీపై ఆరోపణలు సంధించింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైన కొండల్ రెడ్డికి వేర్వేరు ఎపిక్ నంబర్లతో రెండు ఓట్లు ఉండటంపై ఆధారాలు బయటపడటం వివాదస్పదంగా మారింది. ఎన్నికల సంఘం అధికారులు కాంగ్రెస్ ఓట్ల చోరీపై ఇప్పుడేమంటారు అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. సీఎం సోదరుడు కొండల్ రెడ్డి డబుల్ ఓట్ల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.