Site icon vidhaatha

KTR Gurukul food poisoning | మీ పిల్లలకు ప్రభుత్వం విషం పెడితే ఊరుకుంటావా? : రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌

KTR Gurukul food poisoning | సంవత్సరకాలంలో గురుకులాల్లో వెయ్యికి పైగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగినట్లు వచ్చిన నివేదికపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సంవత్సర కాలంలో వేల మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో ఫుడ్ పాయిజన్‌కు గురవడం, 100 మందికి పైగా విద్యార్థులు చనిపోవడం ప్రభుత్వ పూర్తిస్థాయి వైఫల్యం అని చెప్పుకొచ్చారు. ‘తన పిల్లలకు ప్రభుత్వం ఆహారం బదులు విషం పెడితే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా..ఇదే పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి పిల్లలకు జరిగితే కూడా ఇలానే వదిలేస్తారా?’ అని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనలపై కేటీఆర్ స్పందిస్తూ వస్తున్నారు. ఈ మేరకు మంగళవారం గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఫుడ్ పాయిజన్ ఘటనలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలు జరిగిన తరువాత కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రేవంత్ నియంతృత్వ అమానవీయ పాలనకు నిదర్శనమన్నారు. ఇంత మంది విద్యార్థులు అనారోగ్యం పాలైనా, ఆత్మహత్యలు చేసుకున్నా, మరణాల పాలయినా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని విమర్శించారు. గురుకుల విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్, మరణాల అంశాన్ని ప్రభుత్వ దృష్టికి అనేకసార్లు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. కానీ, ప్రతిసారి రాష్ట్ర మంత్రులు కంటి తుడుపు చర్యలతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇంతటి అమానవీయ సంఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు.

రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క సమీక్ష చేయడానికి కూడా సమయం కేటాయించలేకపోయారని నిలదీశారు. ఈ అంశంలో ముఖ్యమంత్రిగా కాకుండా కనీసం ఒక తండ్రిగా అయినా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మన కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు నష్టపోతే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా బాధ్యత ఎవరిది? అని, ముఖ్యమంత్రి గతంలో అన్నట్లే ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఎవరినీ ఉరితీయాలో చెప్పాలని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Exit mobile version