హైదరాబాద్, ఆగస్టు 31(విధాత): కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికను ప్రవేశ పెట్టి చర్చను ప్రారంభించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం నివేదికను తప్పుబడుతూ ప్రాజెక్టును సమర్థిస్తూ తన వాదనను వినిపించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మిగతా మంత్రులతో పలుమార్లు వాగ్వివాదం చోటు చేసుకుంది.
హరీశ్ రావు ప్రసంగం ముగిశాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడం కొనసాగించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకు లాగేసుకుంటున్నారంటూ ఆరోపిస్తూ, కమిషన్ నివేదిక ప్రతులను చించివేసి సభ నుంచి వాకౌట్ చేశారు. భట్టి ప్రసంగం అనంతరం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నిరసనకు దిగారు. బీఆర్ఎస్ సభ్యుల తీరును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్పుబట్టారు. కమిషన్ నివేదిక ప్రతులను చించివేసి సమావేశాన్ని వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తమ ప్రభుత్వం తప్పు చేస్తోందన్నారు. అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే బయట నిరసనలు ఎందుకని విమర్శించారు.