KTR | ఎన్‌డీఏకు కేటీఆర్ కొత్త నిర్వచనం.. నీట్ లీకేజీపై కేంద్రంపై విమర్శలు

నీట్ వివాదం నేపథ్యలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నేషనల్ డిజాస్టర్ అలయన్స్ అంటూ కొత్త నిర్వచనం ఇస్తూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు

  • Publish Date - June 24, 2024 / 07:35 PM IST

విధాత, హైదరాబాద్‌ : నీట్ వివాదం నేపథ్యలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నేషనల్ డిజాస్టర్ అలయన్స్ అంటూ కొత్త నిర్వచనం ఇస్తూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని కేటీఆర్ విమర్శించారు. నీట్, యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలపై ‘ఎక్స్’ వేదికగా కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. విద్యార్థుల జీవితాలను అయోమయానికి గురిచేసేలా జరిగిన ఈ వరుస ఘటనలు దురదృష్టకరమన్నారు. “జూన్ 4న నీట్- యూజీ పేపర్ లీక్ కాగా.. జూన్ 19న యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేశారు.

జూన్ 21న సీఎస్ఐఆర్ యూజీసీ- నెట్ పరీక్ష వాయిదా పడగా.. జూన్ 22న చివరి నిమిషంలో నీట్- పీజీ పరీక్ష సైతం వాయిదా పడిందని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పొంతనలేకుండా ఉన్నాయి” అని మండిపడ్డారు. నీట్-యూజీ ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయినట్లు రుజువైనప్పటికి మోదీ ప్రభుత్వం జులై ఆరో తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఎలాంటి కారణాలు చూపకుండా నీట్‌ – పీజీ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేశారని అక్షేపించారు. ఈ నిర్ణయాల వెనుక ఉన్న లాజిక్ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. అన్నింటికీ కారణం నేషనల్ డిజాస్టర్ అలయన్స్ అంటూ ఎన్డీయే సర్కారుపై విమర్శలు గుప్పించారు.

Latest News