KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పేరును తుడిచేయడమే తన లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
నువ్వు చెప్పులు మోసిన నాడు కేసీఆర్ ఉద్యమానికి ఊపిరి పోశాడని తెలిపారు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడని పేర్కొన్నారు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు.. ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టారని చెప్పారు. నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోశాడు. చిట్టినాయుడు! నువ్వా! KCR పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర KCR అని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అసలు రేవంత్ ఏమన్నారంటే..?
తాను ఫుట్‌బాల్ ప్లేయర్‌నని, గేమ్‌ప్లాన్‌పై పూర్తి స్పష్టత ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న తన కల నెరవేరిందని, ఇంతకుమించి పెద్ద కలలు వేరే ఏమీ లేవని తెలిపారు. కొరియా పర్యటనకు వెళ్లి వచ్చిన జర్నలిస్టులతో సచివాలయంలో మంగళవారం రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయంగా నష్టం జరిగినా ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరుగుతున్నదని, విచారణ సమయంలో కక్ష సాధింపులు ఉండబోవని, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యా పింగ్ నిందితుల పాస్‌పోర్ట్ రద్దయిందని, కాబట్టి అనధికారికంగా విదేశాల్లో ఉండలేరని చెప్పారు. తనది చిన్న వయసని, రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉందని, అణచివేతతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకోలేనని, ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తానని వివరించారు.
రాజకీయాల్లో నాది ప్రత్యేక స్టైల్
అక్రమ సొమ్ముతో సామాజిక మాధ్యమాల్లో బీఆర్‌ఎస్ విష ప్రచారం చేస్తున్నదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సినిమాల్లో రాజమౌళి, రాంగోపాల్‌వర్మ.. ఇద్దరిదీ వేర్వేరు స్టయిల్ అని, రాజకీయాల్లో తన స్టయిల్ తనదని, కేటీఆర్ స్టయిల్ కేటీఆర్‌దని పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని తెలిపారు. కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోయేలా టార్గెట్ చేసినట్టు చెప్పారు. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడానని, త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా హరీశ్‌ను వాడతానని, బావను ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసన్నారు. పోలీసులను పెట్టి వాళ్లను నిర్బంధించవచ్చని, కానీ అది తన విధానం కాదని చెప్పారు. వారు వెళ్లి ప్రజల ఆలోచనను తెలుసుకునే అవకా శం కల్పిస్తున్నానని తెలిపారు. కేటీఆర్ కూకట్‌పల్లి వెళ్లి చిన్నారికి బ్యాగ్ ఇచ్చాడని, తానేమో ఇల్లు ఇస్తాడని అనుకున్నానని ఎద్దేవా చేశారు. స్మార్ట్‌సిటీ, స్పోర్ట్స్ సిటీలను అభివృద్ధి చేస్తామని, రూ. 300 కోట్ల నిధులతో స్కిల్ యూనివర్సిటీని నిర్వహిస్తామని వివరించారు. ఇప్పటి వర కు రూ. 49 వేల కోట్ల అప్పు తెచ్చామని, కేసీఆర్ చేసిన రూ. 56 వేల కోట్ల అప్పు తీర్చామని రేవంత్ వివరించారు.
నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు!
నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు!
నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!
నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు…
— KTR (@KTRBRS) October 30, 2024