గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక క్రమ శిక్షణ..
అధ్వాన్నంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
అప్పులతో ఆస్తులు పెంచడం లేదు
బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఒట్టి ప్రేమ
బడ్జెట్ కేటాయింపులు ఘనం, వ్యయంలో ఘోరం
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎడాపెడా తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తేల్చి చెప్పింది. రాష్ట్రాన్ని భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తుతున్నారని కాగ్ చెప్పకనే చెప్పింది. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన రిపోర్టు లోనే కాగ్ ప్రభుత్వ లోపాల్ని తప్పు పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అని చెప్పడానికి కాగ్ రిపోర్టు నిదర్శనం. బడ్జెట్లలో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అని రిపోర్టు తేటతెల్లం చేసింది. అంచనాలకు, చేస్తున్న ఖర్చులకు ఏమాత్రం పొంతనలేకుండా ఉంది. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీ గా నిధులు పెట్టి, ఆ తరువాత ఖర్చు పెట్టడం లో ఘోరంగా వైఫల్యం చెందిన విషయాన్ని కాగ్ తప్పుపట్టింది.
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా, ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25 వార్షిక బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. అసెంబ్లీలో సోమవారం నాడు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) విడుదల చేసిన నివేదికతో ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైంది. 2024-25 వార్షిక బడ్జెట్ అంచనాలు రూ.2,21,242 కోట్లు ఉంటే, వాస్తవ కేటాయింపులు 1,67,804 కోట్లు మాత్రమేనని స్పష్టం చేసింది. అంటే బడ్జెట్ అంచనాల్లో చేరుకున్నది కేవలం 76శాతం మాత్రమే. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు ఉంటే, యాక్చువల్స్ 1,77,224 కోట్లు, అంటే చేరుకున్నది 80శాతం అని వెల్లడించింది. వార్షిక బడ్జెట్ అంచనాలకు, వ్యయానికి ఎంతో వ్యత్యాసం ఉంది.
రెవెన్యూ లోటు విషయానికి వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరపతి దెబ్బతీసే విధంగా రికార్డు స్థాయిలో లోటును నమోదు చేసింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత తొలి వార్షిక బడ్జెట్ 2014-15కు రెవెన్యూ మిగులు రూ.368 కోట్లు ఉంటే, 2023-24కు రూ.779 కోట్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. అయితే 2024-25 కు గాను రెవెన్యూ లోటు ను ఏకంగా రూ.9,420 కోట్లకు తీసుకువెళ్లింది. దేశంలో కోవిడ్ లాక్ డౌన్ సంవత్సరం మినహా ఎన్నడూ ఇంతగా రెవెన్యూ లోటు రాలేదు. అయినప్పటికీ రెవెన్యూ లోటు మాత్రం మైనస్ రూ.9,420 కోట్లకు ఎందుకు పోయిందో అర్థం కావడం లేదు. కాగ్ లెక్కుల చూస్తే బడ్జెట్ నియంత్రణ కోల్పోయి గాడి తప్పిందని స్పష్టంగా అర్థమవుతున్నది. 7 పద్దులు, 2 అప్రాప్రియేషన్స్ లలో కలిపి మొత్తంగా రూ.31,229 కోట్ల ఖర్చు అదనంగా జరిగింది. ఆర్థిక క్రమ శిక్షణ లోపానికి, బడ్జెట్ అసమర్థన నిర్వహణకు ఇది మరో స్పష్టమైన ఉదాహరణ. ఇక రెవెన్యూ రిసిఫ్ట్స్ ద్వారా సమకూరిన రూ.1.67 లక్షల కోట్లలో 49 శాతం మొత్తాన్ని అనగా ఉద్యోగుల వేతనాలకు రూ.35,521 కోట్లు, వడ్డీలకు రూ.27,803 కోట్లు, పెన్షన్లకు రూ.16,942 కోట్లు ఖర్చు చేశారు.
రెవెన్యూ లోనూ ఇదే గందరగోళం ఉంది. బడ్జెట్ లో రూ.40,453 కోట్లు పేర్కొంటూ, అదనంగా అంటే రూ.50,978 కోట్లు ఖర్చు చేసారు. అంటే 21 శాతం అధికంగా రూ.10,525 కోట్లు వ్యయం చేశారు. ఇక ఎఫ్.ఆర్.బీ.ఎం పరిధిలోని పరిధి అప్పుల విషయానికి వస్తే 2024-25కు గాను జీ.ఎస్.డీ.పీ లో 32.80శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ లక్ష్యాన్ని దాటి 34.29 శాతం పెంచారు. దీంతో అప్పు రూ.5,62,662 కోట్లకు చేరింది. అంటే ప్రభుత్వం తను పెట్టుకున్న పరిమితిని తానే దాటి ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించిందని కాగ్ వెల్లడించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు రెవెన్యూ రిసిప్ట్స్ విషయంలో.. 2023-24లో స్టేట్ రెవెన్యూ రూ.1,11,798 కోట్లు ఉంటే, 2024-25కు రూ.1,09,233 కోట్లకు తగ్గింది. ఒక్క ఏడాదిలోనే సుమారు రూ.2,565 కోట్ల మేర స్టేట్ రెవెన్యూ తగ్గుదల నమోదైంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే మందగించిన ఆర్థిక వృద్ధి కారణం అన్నది సుస్పష్టం అవుతున్నది. రాష్ట్రానికి వచ్చే కేంద్ర పన్నుల వాటా తగ్గిందా అంటే అదీ లేదు.
2023-24లో రూ.23,742 కోట్లు ఉంటే, 2024-25కు రూ.27,050 కోట్లకు పెరిగింది. అదనంగా రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా రూ.3,308 కోట్ల మేరకు పెరిగింది. కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా పెరిగింది. కానీ రాష్ట్ర రెవెన్యూ రెసిప్ట్స్ మాత్రం పెరగకపోవడం శోచనీయం. దీనికంతటికీ రాష్ట్రంలో తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు కారణంగా చెప్పుకోవాలి. వ్యాపారం, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు ఇలా ఒక్కటి కాదు అన్ని రంగాలు కుదేలయ్యాయి. దీంతో జీఎస్టీ, ఆబ్కారీ, స్టాంప్ డ్యూటీ, వాహన పన్నులు వంటి ఆదాయ వనరుల్లో ఘణనీయమైన తగ్గుదల నమోదైంది. వాహనాల నుంచి వసూలు అయ్యే పన్నుల్లో రూ.7,095 నుంచి రూ.6,992 కోట్లకు తగ్గింది. రిజస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రాబడి రూ.14,296 కోట్ల నుంచి రూ.8,473 కోట్లకు తగ్గింది. స్టేట్ ఓన్ టాక్స్ రిసిప్ట్స్ (ఎస్ఓటిఆర్) రూ.1,11,798 కోట్ల నుంచి రూ.1,09,233 కోట్లకు తగ్గింది. రాష్ట్రం సొంత ఆదాయ వనరుల సమీకరణలో దారుణంగా విఫలమైందని కాగ్ రిపోర్టు స్పష్టం చేసింది. 2024-25కు గాను జీ.ఎస్.డీ.పీ వృద్ధి కేవలం 9శాతం మాత్రమే అని కాగ్ తేల్చి చెప్పింది. ప్రభుత్వం మాత్రం 2024-25 వార్షిక బడ్జెట్ లో వృద్ధి రేటు 10.6శాతం అంటూ ప్రచారం చేసుకున్నది. ఇది అబద్దం అని కాగ్ రిపోర్టుతో వెల్లడైంది.
2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తాం, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్తాం అని గొప్పలు చెబుతున్నారు. 1 ట్రిలియన్ డాలర్ అంటే.. ఇప్పుడున్న డాలర్-రూపాయి విలువ ప్రకారం సుమారు 93 లక్షల కోట్లు. 3 ట్రిలియన్ల డాలర్లు అంటే.. 280 లక్షల కోట్లు. ఇది సాధ్యపడాలంటే.. వచ్చే ఎనిమిదేళ్లలో పాటు ప్రతి ఏటా వరుసగా 20.7 శాతం సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) చొప్పున వృద్ధి సాధించాలి. కాగ్ రిపోర్టు ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన 9శాతం వృద్ధి రేటుతో వన్ ట్రిలియన్ డాలర్ అసాధ్యం అన్నది సుస్పష్టం అవుతున్నది.
2023-24లో రూ.38,334 కోట్లు అప్పులు తీసుకోగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 2024-25 వార్షిక బడ్జెట్ లో 56,209 కోట్లకు పెంచారు. గతంలో ఎన్నడూ లేనంతగా రుణాలు తీసుకున్నారు. ఇలా తీసుకున్న రూ.56,968 కోట్ల రుణాల్లో రూ.36,072 కోట్లు మాత్రమే ఆస్తుల పెంపుదలకు వినియోగించారు. రుణం ద్వారా తెచ్చుకున్న నిధులను క్యాపిటల్ ఎక్స్ పెండీచర్ గా మార్చడంలో తీవ్రంగా విఫలమయ్యారని కాగ్ స్పష్టం చేసింది. ఎడాపెడా తెచ్చిన రుణాలు, నిధులను మాత్రం మూలధన పెట్టుబడిగా మార్చడం లేదు.
బడ్జెట్ లో ప్రతిపాదించిన ప్రకారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.4,054 కోట్లు, హైద్రాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డుకు, మిషన్ భగీరథకు, స్వచ్చ్ భారత్ మిషన్ కు రూ.1386 కోట్లు, స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ (ఎస్.డీ.ఎఫ్) ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ యాక్టివిటీస్, నియోజకవర్గాల అభివృద్ది కార్యక్రమాలకు రూ.1201 కోట్లు ఖర్చు చేయకుండా మిగుల్చుకున్నారని కాగ్ తేటతెల్లం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్రానికి సంపదగా మారడం లేదని కాగ్ కుండబద్దలు కొట్టింది.
సాంఘిక సంక్షేమం విషయంలో మీరు చేసిన ఖర్చును చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలపై మీకున్నది పెదవుల మీద ప్రేమనే అన్నది స్పష్టం అవుతుంది. సోషల్ వెల్ఫేర్ కోసం రూ.25,971 కోట్లు కేటాయిస్తే.. చేసిన ఖర్చు కేవలం రూ.9,721 కోట్లు. ఈ వర్గాల కోసం కేటాయించిన నిధుల్లో 37శాతం కోత పెట్టారనేది స్పష్టమవుతున్నది. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు తమది సంక్షేమ ప్రభుత్వం అని, గరీబీ హటావో ప్రభుత్వం అని ప్రతి వేదిక మీద చెప్పుకుంటున్నా వాస్తవంగా బడ్జెట్ కేటాయింపుల ప్రకారం వ్యయం జరగడం లేదు. మాటలు కోటలు దాటడం తప్ప, ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద ప్రేమను నిధులు ఖర్చు చేసి చూపించడం లేదన్నది కాగ్ రిపోర్టుతో స్పష్టం అయ్యింది.
సీపీఎస్ సొమ్మును వాడుకున్న సర్కార్
2004 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్.పీ.ఎస్) ప్రకారం ప్రతి నెలా ఉద్యోగులు తమ వేతనంలో నుంచి కాంట్రిబ్యూట్ చేస్తున్న రూ.10 శాతం మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సమకూర్చాలి. ఇలా సమకూరిన మొత్తాన్ని నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్.ఎస్.డీ.ఎల్) లేదా ట్రస్టు బ్యాంకు లో జమ చేయాలి. మార్చి 31వ తేదీ 2025 నాటికి రూ.1,079 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసి రూ.3,213 కోట్లు పెండింగ్ లో పెట్టింది. ఉద్యోగులు ఎంత చెల్లించాలి, ప్రభుత్వం తన వాటాగా ఎంత సమకూర్చాలనే దానిపై స్పష్టత లేదని కాగ్ లేవనెత్తింది. ట్రస్టు బ్యాంకులో బదలాయించకుండా తన ఖజానాలోనే పెట్టుకున్న రూ.3.213 కోట్లకు వడ్డీ చెల్లించాలని కాగ్ స్పష్టం చేసింది.
Read More:
Fine Rice Ration | రూపాయికి కిలోబియ్యం కాంగ్రెస్‌దే.. ఇప్పుడు సన్న బియ్యం కూడా : సీఎం రేవంత్
ప్రజల కోసం ప్రశ్నించకపోతే పదవిలో ఉండటానికి అనర్హుడిని: రాజగోపాల్ రెడ్డి ఫైర్
