Fine Rice Ration | రూపాయికి కిలోబియ్యం కాంగ్రెస్‌దే..  ఇప్పుడు సన్న బియ్యం కూడా : సీఎం రేవంత్‌

దొడ్డు బియ్యం పేదలకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదనే తెలంగాణలో సన్నబియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

Revanth Reddy rice scheme

Fine Rice Ration | రూపాయి కిలో బియ్యం పథకం విజయభాస్కర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని, కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ తరువాత ఎన్టీరామారావు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడంతో అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని గుర్తు చేశారు. సోమవారం నాడు శాసన మండలి హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలో నలభై ఏళ్లుగా ఇదే పథకం కొనసాగుతోంది.. ఆనాటి నుంచి దొడ్డు బియ్యమే ఇస్తూ వచ్చారన్నారు. రానురాను దొడ్డు బియ్యం తినేవారు లేక ఆ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందన్నారు. దొడ్డు బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి ఖర్చు తప్ప… పేదలకు ఉపయోగపడటం లేదని గ్రహించామన్నారు. అందుకే పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించామన్నారు. ఇందుకోసం రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ అందించి సన్నవడ్లు పండించాలని ప్రోత్సహించామన్నారు. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, మున్ముందు ఇది 90 శాతం కూడా కావచ్చన్నారు. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు అందించామని, రైతులకు లాభం చేకూర్చడమే కాదు.. పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గిందన్నారు. పౌరసరఫరాల మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైందన్నారు.

సన్న బియ్యం ప్రారంభించి ఏడాది

రాష్ట్రంలో నేటితో సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయిందని, ఈ సందర్భంగా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులకు అసెంబ్లీలో సన్నబియ్యం తో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశామన్నారు. మా నెక్ట్స్ టార్గెట్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందించడమేనన్నారు. అందుకే వరి ఒక్కటే కాదు… ఇతర పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లిస్తున్నామని, పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాల్సన అవసరం ఉందన్నారు. పంట మార్పిడి విషయంలో రైతులపై ఒత్తిడి చేయం.. అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈగల్, హైడ్రా లాగే ఆహార కల్తీని నియంత్రించడానికి ఒక వ్యవస్థను తీసుకువస్తామన్నారు. దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణ లో పకడ్బందీ వ్యవస్థను తీసుకొస్తామన్నారు.

కనీస మద్ధతు ధర కాంగ్రెస్ పార్టీ ఘనత

రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చిందన్నారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువ అన్నారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పకడ్బందీ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారు… కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదన్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు.

Latest News