సన్న బియ్యం కూడా తినడం లేదు..రేషన్ డీలర్లకే తిరిగి అమ్ముతున్నారు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో సన్న బియ్యం పథకం ప్రారంభించింది. వంద శాతం కార్డుదారులు కాకపోయినా కనీసం తొంబై శాతం మంది కార్డుదారులు సద్వినియోగం చేసుకుంటారని భావించారు. అయినా వండుకోకుండా ఏకంగా రేషన్ దుకాణదారులకే తిరిగి విక్రయిస్తున్నారు. ఈ పథకాన్ని ప్రజలే తప్పుదారి పట్టిస్తుండగా, దుకాణాల యజమానులు లక్షల రూపాయలు గడిస్తున్నారు.

- సన్న బియ్యం కూడా తినడం లేదు!
- రేషన్ డీలర్లకే తిరిగి అమ్ముతున్నారు
- సగం సన్న బియ్యం ఇతర రాష్ట్రాలకు
- ప్రతి ఏడాది సర్కార్ వ్యయం రూ.13,465 కోట్లు
- సరిహద్దు చెక్ పోస్టులు ఎత్తేయడం వరం
- పౌర సరఫరాల విజిలెన్స్ రద్ధు కూడా కారణం
- ఆరోగ్య శ్రీ కోసమేనా బియ్యం కార్డులు
హైదరాబాద్, అక్టోబర్ 12(విధాత): రాజుల సొమ్ము రాళ్ల పాలు కావడం అంటే ఈ పథకం ఏమో. దొడ్డు బియ్యం తినడం లేదని, నల్ల బజార్, ఇతర దేశాలకు వెళ్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో సన్న బియ్యం పథకం ప్రారంభించింది. వంద శాతం కార్డుదారులు కాకపోయినా కనీసం తొంబై శాతం మంది కార్డుదారులు సద్వినియోగం చేసుకుంటారని భావించారు. అయినా వండుకోకుండా ఏకంగా రేషన్ దుకాణదారులకే తిరిగి విక్రయిస్తున్నారు. ఈ పథకాన్ని ప్రజలే తప్పుదారి పట్టిస్తుండగా, దుకాణాల యజమానులు లక్షల రూపాయలు గడిస్తున్నారు. పౌర సరఫరాల విభాగంలో విజిలెన్స్ విభాగం తీసేయడం, నిరంతరం నిఘా లేకపోవడం, ప్రభుత్వం పట్టింపు లేకపోవడం మూలంగా సన్న బియ్యం పథకానికి కూడా చెదలు పడుతోంది. కనీసం యాభై శాతం మంది కూడా ఈ బియ్యాన్ని వండుకోవడం లేదంటే ప్రభుత్వం వెచ్చించే వేల కోట్ల రూపాయలు ఎంతగా దుర్వినియోగం అవుతున్నాయో స్పష్టమవుతోంది.
రాష్ట్రంలో నాలుగు దశాబ్ధాలుగా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. పౌర సరఫరాల ద్వారా అధిక ధరకు సేకరించి నామమాత్రపు ధరతో విక్రయిస్తున్నారు. అప్పుడెప్పుడో ఎన్టీరామారావు ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంలో మార్పులు చేసి ఒక రూపాయకే తగ్గించారు. ఈ బియ్యం బాగా లేవంటూ గత దశాబ్ధకాలంగా లబ్ధిదారులు ఇడ్లీ బండ్లు, దోశ బండ్లు, కిరాణా దుకాణాలు, బ్రోకర్లకు విక్రయించారు. కోళ్ళ ఫారాలు, లిక్కర్ కంపెనీలు, హొటళ్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తుండేవి. ఒక కిలో బియ్యం రూ.10 వరకు విక్రయించి సొమ్ములు చేసుకున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడంతో రైస్ మిల్లర్ యజమానులు వీటిని రీ సైక్లింగ్ చేసి మళ్లీ కిరాణ దుకాణాలు, రైస్ షాపుల ద్వారా మధ్య తరగతి ప్రజలకు సన్న బియ్యం అంటూ విక్రయించేవి. సన్న బియ్యం బాగున్నాయంటూ ప్రజలు కూడా భ్రమల్లో కొనుగోలు చేసేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చోద్యం చూసింది తప్ప చర్యలు తీసుకునే సాహసం చేయలేదు. మన ఇంట్లో నుంచి ఇస్తున్నామా, జనం సొమ్ము ఎవడేమి చేసుకుంటే మనకేమిటీ అనే విధంగా వ్యవహరించింది. ధాన్యం సేకరణ, గోనె సంచుల కొనుగోళ్ళు, రవాణాలో మనకు డబ్బులు ముట్టాయా, చాలు అనే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్తున్నా కట్టడి చేయకుండా ప్రేక్షక పాత్ర వహించారు. కట్టడి చేసేందుకు అధికారులు ఉన్నా చేష్టలుడిగి చూస్తుండి పోయింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తే కోటా మరింతగా పెంచాల్సి ఉంటుందని, సబ్సిడీ పెంచాల్సి వస్తుందనే దుర్భుద్ధితో ఆ పని కూడా పదేళ్లు చేయలేదనేది జగమెరిగిన సత్యం. ఈ బియ్యం రేషన్ దుకాణ యజమానులు, దళారులకు ఆదాయ వనరుగా మారిందనే చెప్పాలి.
సన్న బియ్యానికి కూడా చెదలు
దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తే లబ్ధిదారులు తింటారనే సదుద్ధేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న హుజూర్ నగర్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ధర ఎక్కువైనా సరే ఏమాత్రం ఆలోచించకుండా అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.10,665 కోట్లు వెచ్చించి దొడ్డు బియ్యం పథకం అమలు చేసింది. దీనికి అదనంగా మరో రూ.2,800 కోట్లు కలిపి మొత్తం రూ.13,465 కోట్లతో సన్న బియ్యం పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.5489 కోట్లు భరిస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ భారం రూ.8వేల కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేశారు. ఒక కిలో బియ్యంపై తెలంగాణ ప్రభుత్వం రూ.40 వరకు వెచ్చిస్తున్నట్లు తెలిసింది. ఈ పథకాన్ని అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రారంభించడమే కాకుండా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సహపంక్తి భోజనాలు కూడా చేశారు. ఈ పథకం ప్రభావంతో బహిరంగ మార్కెట్ లో ఒక కిలో సన్న బియ్యం పై రూ.15 నుంచి రూ.20 వరకు తగ్గిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ధరలు మరింతగా తగ్గుతాయోమోనన్న భయానికి రైస్ షాపుల యజమానులు ఆందోళనకు గురయ్యారు. ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా వదిలేయకుండా రేషన్ దుకాణాల నుంచి సన్న బియ్యం కొనుగోళ్లు చేశారు. పౌర సరఫరాల శాఖ తో పాటు ప్రభుత్వం కూడా బాగుందంటూ కితాబునిచ్చింది.
ఆరోగ్య శ్రీ కోసమే బియ్యం కార్డుల దుర్వినియోగం
ఇక్కడి వరకు బాగానే ఉన్నట్లు కన్పిస్తున్నా సన్న బియ్యం పథకం కూడా దళారులకు వరంగా మారింది. చాలా మంది లబ్దిదారుల నుంచి సన్న బియ్యం కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తూ లాభాలు గడిస్తున్నారు. కేజీ సన్నబియ్యం రూ.15కు కొనుగోలు చేసే విధానం మళ్లీ ఊపందుకున్నది. సన్న బియ్యం నూకలు వస్తున్నాయని కొందరు, మేము సన్నం బియ్యం తినే వాళ్లం కాదు అంటూ మరికొందరు, ఆరోగ్య శ్రీ కార్డు కోసమే బియ్యం తీసుకుంటున్నామని ఇలా ఎవరికి వారు దీన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి చేతుల్లోని కార్డుల మూలంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటున్నది. చాలా మంది లబ్ధిదారులు రేషన్ దుకాణాల యజమానులకే రూ.15 చొప్పున విక్రయించి అక్కడికక్కడే డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాల యజమానులు దళారులకు విక్రయిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలకు భారీగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలంపూర్, జహీరాబాద్, అదిలాబాద్, వాంకిడి, నాగార్జున సాగర్, కోదాడ, అశ్వారావుపేట, పాల్వంచ ప్రాంతాల ద్వారా సన్న బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చెక్ పోస్టులను ఎత్తి వేసింది. ఇది రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్ కు వరంగా మారిందనే చెప్పాలి. ఉదాహారణకు లబ్ధిదారుల నుంచి దళారులు సన్నబియ్యం సేకరించి మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం. తక్కువ ధరకే సేకరించిన బియ్యాన్ని రూ.40 నుంచి రూ.80 కి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇలా సన్న బియ్యాన్ని తరలిస్తున్నవారు అధికారుల చేతులు కూడా తడుపుతుండటంతో వారిపై నామమాత్రంగా కేసులు నమోదు చేసి, చూసి చూడనట్లు వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి నెలా 1.96 లక్షల మెట్రిక్ టన్నులు సన్న బియ్యం
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రస్తుతం 17,256 రేషన్ దుకాణాల ద్వారా 1.96 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ అవుతున్నట్లు ఒక అంచనా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హులైన వారికి కార్డులు కొత్తగా మంజూరు చేయడంతో కోటా పెరిగింది. ఇందులో సుమారు ఒక లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు తరలుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అదేమంటే లబ్ధిదారులు తొండి వాదనలు చేస్తున్నారు. నూకల ఎక్కువగా ఉన్నాయి, తినలేమని ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కు వెళ్తున్నట్లు పౌర సరఫరాల అధికారులకు కూడా స్పష్టమైన సమాచారం ఉన్నా ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో ఎక్కడ కూడా సన్న బియ్యం పథకం అమలు చేయకపోవడం కూడా డిమాండ్ కు కారణంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సరిహద్దుల్లో నిఘా పెంచడంతో పాటు పౌర సరఫరాల విభాగంలో విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజిలెన్స్ విభాగం తో బ్లాక్ మార్కెటింగ్ తగ్గడంతో పాటు రేషన్ దుకాణాల యజమానులు, దళారులు కొనుగోళ్లు నిలిపివేస్తారని అధికారులే అంటున్నారు.