నిబంధనలు పాటించని ప్రైవేట్‌ హాస్పిటళ్ల లైసెన్సులు రద్దు : మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం

డీఎంహెచ్‌వోలు ప్రజలకు జవాబుదారీతనం గా ఉండాలలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిహ అన్నారు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. డీఎంహెచ్‌వోలు ప్రైవేటు ఆసుపత్రులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు

  • Publish Date - June 27, 2024 / 07:46 PM IST

నిబంధనలు పాటించని ప్రైవేట్‌ హాస్పిటళ్ల లైసెన్స్లు రద్దు
ప్రైవేటు ఆసుపత్రుల్లో విస్తృత తనిఖీలు
ప్రతి 30 కి.మీ.కు ఒక ప్రభుత్వ హెల్త్ సెంటర్
పేదలకు ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం
ప్రభుత్వ వైద్యుల అటెండెన్స్ నమోదు తప్పనిసరి
అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలతో సమీక్షలో
వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ ఆదేశం

హైదరాబాద్‌: డీఎంహెచ్‌వోలు ప్రజలకు జవాబుదారీతనం గా ఉండాలలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిహ అన్నారు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. డీఎంహెచ్‌వోలు ప్రైవేటు ఆసుపత్రులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రయివేటు ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేయాలని స్పష్టం చేశారు. గురువారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలతో దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవా కార్యక్రమాలను ఎలా సమన్వయం చేయాలనే అంశంలో డీఎంహెచ్‌వోలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు అందించడంలో డీఎంహెచ్‌వోలది గురుతరమైన బాధ్యత అన్నారు. జిల్లా, ఏరియా, పీహెచ్‌సీల మధ్య భౌగోళికంగా కనెక్టివిటీపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉండాలన్నారు. పేదవాడికి ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యుల అటెండెన్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని చెప్పారు. జిల్లాలవారీగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు చేసే బాధ్యత డీఎంహెచ్‌వోలదేనని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుపడేలా చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోగులకు మెరుగైన డైట్ ను అందించాలని, డాక్టర్లు విధిగా సమయపాలన పాటించేలా, మెరుగైన వైద్య సేవలను అందించేలా డీఎంహెచ్‌వోలు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా విస్తృత సేవలను అందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఆరోగ్య మందిర్‌లలో అదనపు సేవలను అందించడానికి కృషి చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వోలు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అండ్‌ పిసి అండ్ పి ఎన్ డి టి యాక్ట్ అమలు, అవగాహన పై రూపొందించిన వాల్ పోస్టర్లను వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చోoగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్తో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆవిష్కరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, NHM అధికారులు, వివిధ జిల్లాల డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest News