మ‌మ్మ‌ల్ని ఓడిస్తే రెస్టు తీసుకుంటం: సీఎం కేసీఆర్‌

రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ‌ను ఓడిస్తే పోయి రెస్టు తీసుకుంటామ‌ని, కానీ.. ప్ర‌జ‌లు మాత్రం న‌ష్ట‌పోతార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు

  • కానీ.. న‌ష్ట‌పోయేది మాత్రం ప్ర‌జ‌లే
  • ధరణి తీసేస్తే దళారుల రాజ్యమే
  • కాంగ్రెస్ వస్తే తెలంగాణ ఆగమే
  • రైతు బంధు వద్దంటుంది…
  • 3 గంటల కరెంట్ ఇస్తామంటుంది
  • కాంగ్రెస్ దుర్మార్గులను రానివ్వద్దు
  • రైతుబంధును పుట్టించిందే కేసీఆర్
  • దశల వారీగా పెన్షన్లు పెంచుతాం
  • దేశానికి తెలంగాణ మార్గదర్శకం
  • అచ్చంపేట, వనపర్తి
  • ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ‌ను ఓడిస్తే పోయి రెస్టు తీసుకుంటామ‌ని, కానీ.. ప్ర‌జ‌లు మాత్రం న‌ష్ట‌పోతార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నిక‌లు వ‌చ్చాయి క‌నుక ఎవరెవరో మీ ఇంటికి వస్తార‌ని, ఎవరు చెప్పినా వినకుండా మీ బుద్ధి ప్రకారం ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. వ‌చ్చే ఎన్నికల్లో ఆగం కాకుండా.. తెలంగాణను ఆగం చేయకుండా ఆలోచించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఏమరపాటు వహిస్తే గోస పడతామని హెచ్చ‌రించారు.

గురువారం అచ్చంపేట, వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో ముఖ్య‌మంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. కాంగ్రెస్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్ట‌ల్‌ను తీసేస్తా అంటుంద‌న్న కేసీఆర్‌.. మళ్ళీ రైతులు వీఆర్వోలు, గిర్దావార్ల చేతుల్లోకి వెళతార‌ని చెప్పారు. అంతా దళారుల మయం అవుతుంద‌న్నారు. రైతులకు మేలు చేసే ధరణిని తీసేస్తే మళ్ళీ రైతులు కైలాసపటంలో పాము నోట్లో పడ్డట్లే అని అన్నారు. ‘ధరణి లేకపోతే ఎన్ని హత్యలు జరిగేవి? ఎన్ని తలలు పగిలేవి? ఎన్ని భూమి రికార్డులు తారుమారు అయ్యేవి? ధరణితో భూ హక్కులు రైతులకే దక్కాయి. ఇలాంటి ధరణిని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి కాంగ్రెస్ నేతలు తీసేస్తామంటున్నారు. ఆ పార్టీ అవసరమా?’ అని కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను ప్రశ్నించారు.




 


కేసీఆర్ ద‌మ్మేందో దేశానికి తెలుసు

‘కేసీఆర్‌కు దమ్ముందా? కొడంగల్ రా! అని ఒకడు.. గాంధీ బొమ్మ వద్దకు రా అని మరొకడు అంటున్నారు. నాకున్న దమ్ము ఇండియా మొత్తం తెలుసు.. కేసీఆర్‌తో పెట్టుకునే దమ్ము, ధైర్యం ఎవ్వరికీ లేవు’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పదేళ్లు ఎంత అభివృద్ధి జరింగిందో అందరికీ తెలుస‌ని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెల‌వాల్సింది ప్ర‌జ‌లేన‌ని అన్నారు. తెలంగాణ సాధ‌న‌కు తాను ప‌డ్డ క‌ష్టాన్ని కేసీఆర్ వివ‌రించి చెప్పారు. తెలంగాణ రాక ముందు ఉన్న పేద‌రికాన్ని, క‌ష్టాల‌ను ఆయ‌న గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత త‌మ ప్ర‌భుత్వం సాధించిన అభివృద్ధిని వివ‌రించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదన్నారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటే వస్తుందని, ఇప్పటికే కర్ణాటక లో గెలిచిన ఈ మొనగాళ్లు కరెంట్ సక్రమంగా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వస్తే ఇక్కడి రైతులకు కరెంట్ కష్టాలు తప్పవన్నారు.


పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఇక్కడి దద్దమ్మ నేతలు 165 కేసులు పెట్టారన్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం కల్పించటంతో మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారని, కాంగ్రెస్ వస్తే అది రెండు టన్నుల ధాన్యానికి పడిపోతుందని కేసీఆర్ హెచ్చ‌రించారు. దళితుల గురించి ఆనాటి ప్రధాని నెహ్రూ ఆలోచించి ఉంటే ఈ నాడు దళితులందరూ లక్షాధికారులు అయ్యేవారన్నారు. దళితబంధు అనే పథకం తాను పుట్టించిందే న‌ని చెప్పుకొన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే దశలవారీగా ఆసరా పింఛన్లు ఐదు వేల వరకు, రైతు బంధు రు.16 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. 93 లక్షల మందికి రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తామన్నారు. అచ్చంపేటకు సాగునీరు అందించేందుకు ఉమామహేశ్వర లిఫ్ట్ ను ప్రారంభించుకుందామన్నారు. ఇక్కడి బీఆరెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేటకు అడిగిన అభివృద్ధి పనులను ఎన్నికల తరువాత అమలు చేస్తామన్నారు.

వ‌రి వ‌న‌ప‌ర్తిగా మారింది

ఒకప్పుడు వనపర్తి లో వలసలు అధికంగా ఉండేవని, నిరంజన్ రెడ్డి మంత్రి అయ్యాక ఇప్పుడు ‘వరి ‘ వనపర్తి గా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతున్నాదని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. వీరి హయాంలో ఐదు మెడికల్ కళాశాలలు జిల్లాకు వచ్చాయన్నారు.

ఈ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేష్వర్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మాజీ స్పీకర్ మధుసూదనాచారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest News