మాజీ ఎమ్మెల్యే గువ్వల అరెస్ట్

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న చందంగా ఉంది అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి. గతంలో ఎదురు తిరిగిన వారిని అరెస్ట్ చేయించిన ఘనత దక్కించుకున్న బాలరాజును

  • Publish Date - December 18, 2023 / 02:40 PM IST

– పోలీస్ స్టేషన్ ఎదుట బీఆరెస్ శ్రేణుల ధర్నా

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న చందంగా ఉంది అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి. గతంలో ఎదురు తిరిగిన వారిని అరెస్ట్ చేయించిన ఘనత దక్కించుకున్న బాలరాజును.. ప్రస్తుతం అదే పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అచ్చంపేటకు వస్తున్నారనే సమాచారం తెలుకున్న పోలీసులు వెల్డoడ మండలం వద్ద బాలరాజును అదుపులోకి తీసుకుని అక్కడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అచ్చంపేటకు వస్తే కాంగ్రెస్ శ్రేణులు గువ్వలను అడ్డుకుంటారనే విషయం తెలుసుకున్న పోలీసులు.. గొడవలు ఆపాలనే ఉద్దేశంతో ముందస్తుగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.


విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు వెల్డoడ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. గువ్వల బాలరాజును వెంటనే విడిచిపెట్టాలని నిరసన తెలిపారు. వారిని పోలీస్ లు చెదరగొట్టి గొడవ సద్దుమణిగించారు. అచ్చంపేటలో ప్రెస్ మీట్ ఉందని, అక్కడికి వెళ్ళానివ్వాలని పోలీస్ లకు గువ్వల చెప్పినా ఫలితం లేకపోయింది. గువ్వల దంపతులను సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. అచ్చంపేట వెళ్లొద్దని, తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని పోలీస్ లు సర్ది చెప్పారు. మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తిరిగేoదుకు అనుమతి కావాలా? అంటూ పోలీసులపై బాలరాజు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమ అరెస్ట్ లకు భయపడేది లేదని గువ్వల అన్నారు.

Latest News