CM Revanth Reddy : కండువా వేస్తే పార్టీ మారినట్టా? స్థానిక ఎన్నికలపై నిర్ణయం కాలేదు.. చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

కండువా వేస్తే పార్టీ మారినట్టా? స్థానిక సంస్థల ఎన్నికలు, బీఆర్ఎస్ ఫిరాయింపులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (విధాత): రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు సెప్టెంబర్‌ 30వ తేదీలో నిర్వహించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి వద్దే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ పంపిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 90 రోజుల్లోపుగా వాటిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ 90 రోజుల గడువు వరకు వెయిట్ చేస్తామని తెలిపారు. కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే విషయమై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌ చేశారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై నిర్ధిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంలో బీఆర్ఎస్ పార్టీకే స్పష్టత లేదని ఆయన సెటైర్లు వేశారు. తన ఇంటికి వచ్చిన వాళ్లకు కండువా వేస్తే పార్టీ మారినట్టేనా? అని ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చినవాళ్లకు ఏ కండువా వేస్తానో వచ్చినవాళ్లకు ఎలా తెలుస్తుందని అన్నారు. ఈ రోజు కూడా తాను ఎంతో మందికి కండువా కప్పానని చెప్పారు. ఆ కండువా ఏంటో కూడా చూడకుండా వాళ్లు కప్పించుకున్నరని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌కు అసెంబ్లీలో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీశ్ రావు అన్నారని రేవంత్‌ గుర్తు చేశారు. కానీ, 37 కాదని మరో సంఖ్యను కేటీఆర్ చెబుతున్నారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీఆరెస్‌ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల నుంచి నెలకు 5వేల రూపాయలు బీఆరెస్‌కు పార్టీ ఫండ్‌గా వెళుతున్నదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవన్నీ టెక్నికల్‌గా చూస్తే.. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, నేను ఒకటేనని ప్రచారం చేస్తున్నారని, అందుకే కేటీఆర్‌, లోకేష్‌ కలిసిన విషయం చెప్పానని రేవంత్‌ అన్నారు. లోకేష్‌ తమ్ముడు లాంటివాడని కేటీఆర్‌ కూడా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఆయనకు మద్దతుగా ఆందోళన చేసినవారిని అరెస్ట్‌ చేస్తామని అప్పటి మంత్రి కేటీఆర్ అన్నారని గుర్తు చేశారు.

ఆ పంచాయితీతో నాకేం సంబంధం?

కల్వకుంట్ల కుటుంబ పంచాయితీతో తనకు సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తి పంచాయితీ నడుస్తోందని అన్నారు. అందుకే కుటుంబ సమస్య బజారునపడిందని అన్నారు. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోష్ అని అర్థమవుతున్నదని చెప్పారు. ఒక ఆడబిడ్డపై ఆ నలుగురూ దాడి చేస్తున్నారని ఆరోపించారు. కవిత కాంగ్రెస్‌లో చేరుతానంటే తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. తానేమీ కవితకు సపోర్ట్‌ చేయడం లేదని, ఇది వారి ఇంటి సమస్య అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ యువతను పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కవిత దూరమైందని అన్నారు. గతంలో తాను తన కూతురు పెళ్లికి కూడా వెళ్లకుండా అడ్డుపడ్డారని గుర్తు చేశారు. 2014–19 కాలంలో కేసీఆర్ క్యాబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేని విషయాన్ని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్‌ కుటుంబ వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారని అన్నారు. బీఆరెస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్‌, హరీశ్‌ ప్రయత్నించారని స్వయంగా కవితే చెప్పారని అన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని సీఎం తెలిపారు. చట్టసభల్లో లోకల్ బాడీ ఎలక్షన్లలో మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని తెలిపారు.

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఏమైంది?

కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో విచారణ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు ఏమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎప్పుడో అప్పగించినా.. ఇప్పటివరకు సీబీఐ విచారణ ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే ఈ కేసులో అన్ని వివరాలూ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దాని ప్రకారం విచారణ చేస్తే అన్ని వివరాలూ బయటకు వస్తాయని అన్నారు. కేటీఆర్‌ ఏది చెబితే కిషన్‌రెడ్డి అదే చేస్తారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయకుండా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం హైకోర్టు పరిధిలో ఉందన్నారు. అందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మెట్రో విషయంలో కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి మెలికలు పెడుతున్నారని సీఎం విమర్శించారు. ఎల్‌అండ్‌టీ తీసుకునే నిర్ణయంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు సిద్దమని చెబుతున్నారని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలన్నారు. కిషన్ జీ భార్య ఇటీవల లొంగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.

డ్రగ్స్‌ కట్టడి చేస్తున్నాం

మాదక ద్రవ్యాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడి దగ్గర నుంచీ మాదక ద్రవ్యాలను కట్టడి చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్నవాళ్లను తమ ఈగిల్‌ టీమ్‌ గోవాకు వెళ్లి పట్టుకున్నదని గుర్తు చేశారు. హైదరాబాదులో దొరికిన డ్రగ్స్ తయారీ కంపెనీ బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఏర్పడిందని చెప్పారు. అప్పుడు వాళ్లు ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. స్వయంగా కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్‌లో డ్రగ్స్‌తో అడ్డంగా దొరికితే కోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నారని విమర్శించారు.

యూరియాపై బీజేపీ, బీఆరెస్‌ రాజకీయం

యూరియా కొరత విషయంలో బీఆరెస్‌, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ప్రస్తుతం 2 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొరతను సృష్టించిందని, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాయని ఆరోపించారు.

నక్సల్స్‌తో చర్చలకు ఇబ్బందేంటి?

నక్సలైట్లు లొంగిపోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశం ఉందన్నారు. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చలు చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని అన్నారు. వాళ్లు కూడా మన అన్నదమ్ములే కదా అని వ్యాఖ్యానించారు. నక్సల్స్‌ లొంగుబాటు విషయంలో కేంద్ర దయ చూపాలని అన్నారు.

Latest News