CM Revanth Reddy : పైరసీపై ప్రభుత్వం ఉక్కుపాదం.. స్పెషల్ వింగ్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలు!

సినిమా పైరసీపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్. ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్టు తర్వాత సీఎం రేవంత్ ప్రత్యేక యాంటీ పైరసీ వింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

CM Revanth Reddy

విధాత, హైదరాబాద్ : సినిమా పైరసీపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై సినిమా పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయడానికి సీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్టు వ్యవహారాన్ని సర్కార్ ఛాలెంజ్‌గా తీసుకుంది. ఈ క్రమంలో పైరసీపై ఉక్కుపాదం మోపేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సినిమా పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. కాగా, ఇటీవల సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐ బోమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు రవి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో సినిమా ఇండస్ట్రీలో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ఇమ్మడి రవితో పాటు పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా, ఇమ్మడి రవి పైరసీ వెబ్‌సైట్ ముసుగులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బుధవారం రవి కస్టడీకి నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా బషీర్‌బాగ్‌లోని సైబర్‌క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు పైరసీ వెబ్‌సైట్లకు సంబంధించి అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. నాంపల్లి కోర్టు మొత్తం అయిదురోజుల పాటు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని విచారణ చేసేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది.

Latest News