నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గ విస్తరణ..పీసీసీ చీఫ్ భర్తీపై అధిష్టానంతో కీలక చర్చలు … చేరికలపై కూడా మంతనాలు

సీఎం రేవంత్ రెడ్డి నేడు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్ పోస్టులు, పీసీసీ చీఫ్ భర్తీ, బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలు వంటి కీలక అంశాలపై ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశముంది

  • Publish Date - June 23, 2024 / 07:10 PM IST

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నేడు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్ పోస్టులు, పీసీసీ చీఫ్ భర్తీ, బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలు వంటి కీలక అంశాలపై ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశముంది. అలాగే ఎంపీలు పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ధేశం చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య అధికంగా ఉండటం…బీఆరెస్ నుంచి చేరే వారికి మంత్రి పదవుల హామీలు వంటి పరిణామాలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించి క్లారిటీ తీసుకొవచ్చని ఆ పార్టీ వర్గాల కథనం. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయాల్సివుంది. ఇందులో పార్టీలో చేరిన, చేరనున్న బీఆరెస్ ఎమ్మెల్యేలకు ఎన్ని కేటాయిస్తారన్నది ఆసక్తికరం. ఇప్పటికే ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. విద్యాశాఖ, హోంశాఖలకు మంత్రులు లేకపోవడంతో ఈ రెండు రంగాల్లో కొంత ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుంది. దీంతో ముందుగా కనీసం నాలుగు మంత్రి పదవులైనా భర్తీ చేస్తే మంచిదన్న అభిప్రాయంలో సీఎం, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో బీఆరెస్ బలహీన పడటం..బీజేపీ పుంజుకున్న రాజకీయ పరిణామాలను సైతం విశ్లేషించి మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు కట్టబెట్టే యోచన చేయవచ్చంటున్నారు.

మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోవడంతో నామినేటెడ్‌ పోస్టుల భర్తీని ఆ పార్టీ అధిష్టానం పునస్సమీక్షించవచ్చని తెలుస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పోస్టులను భర్తీ చేయడం, సామాజిక సమీకరణలలో భాగంగా ఇప్పటికి మంత్రివర్గంలో, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం దక్కని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై కూడా దృష్టి పెట్టనున్నట్లుగా సమాచారం. కాగా ఇప్పటికే ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో మార్పులు చేర్పులకు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, ఎంపీలు పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పార్లమెంటు సమావేశాల హడావుడిలో ఉండనున్న కాంగ్రెస్ ముఖ్యనేతలు సీఎం రేవంత్‌రెడ్డి ఆశిస్తున్న అంశాలపై ఎంతమేరకు చర్చించి స్పష్టతనిస్తారన్నది సందేహాంగా ఉంది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన సఫలీకృతం కావడం అనుమానంగానే ఉంది. కాగా ఇటీవల వివాదస్పదమైన బొగ్గు గనుల వేలం ప్రక్రియపై కేంద్రంతో చర్చించి సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు సాధించే అంశం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఎజెండాలో ఉందో లేదో తెలియాల్సివుంది.

Latest News