Site icon vidhaatha

CM Revanth Reddy | ఔటర్ వరకు హైడ్రా.. హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు: సీఎం రేవంత్ రెడ్డి

అపరాధ రుసుము వసూళ్ల బాధ్యత
అసెంబ్లీ నియోజక వర్గ పరిది, పోలీస్టేషన్ల పరిధి ఒకే జోన్ల పరిధికి వచ్చేలా విభజన
అసెంబ్లీ సమావేశాల్లోగా విధివిధానాలు రూపొందించండి
అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

విధాత: హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్) ను ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2వేల చదరపు కి.మీ పరిధిలో విధులు నిర్వహించేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో సీ ఎస్ శాంతి కుమారి, సీఎం ఓ ముఖ్యకార్యదర్శి శేశాద్రి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలితో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విధివిధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలన్నారు.

అలాగే జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్ లో వచ్చేలా జాగ్రత్త వహించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల కు గురికాకుండా, ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవడానికి వీలుగా నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయాలన్నారు. హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు. హైడ్రా ఒక బలమైన వ్యవస్థగా ఉండాలన్నారు. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Exit mobile version