- గ్రీన్ ఛానల్ ద్వారా పనులకు నిధులు మంజూరు
- నల్లగొండకు మాత్రమే కాదు తెలంగాణకు ఎస్ఎల్బీసీ కీలకం
- ఎస్ఎల్బీసీ పునరుద్దరణపై సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్4(విధాత): ఎస్ఎల్‌బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదిని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఎస్ఎల్‌బీసీ కేవలం నల్లగొండ జిల్లాకు మాత్రమే కాదని తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమన్నారు. గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ఎస్ఎల్ బీసీ పనుల పునరుద్దరణ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి ఎస్ఎల్‌బీసీలో అవకాశం ఉందన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యల పైన తక్షణమే సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అనుమతులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, 2027 డిసెంబరు 9 లోగా ఎస్ఎల్‌బీసీని పూర్తి చేయాలన్నారు.
డిసెంబర్ 9,2027న తెలంగాణ ప్రజలకు ఎస్ఎల్‌బీసీని అంకితం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ పనులకు గ్రీన్ ఛానల్‌లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపి అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని వెల్లడించారు. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకోనని, సొరంగం తొవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ఎస్ఎల్‌బీసీ పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్‌ఎల్‌బీసీ పూర్తి కావాలి.. పనులు ఆగడానికి వీలు లేదని సీఎం పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,నీటి పారుదల శాఖ గౌరవ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కల్నల్ పరిక్షిత్ మెహ్రా , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.