హైదరాబాద్, సెప్టెంబర్ 21(విధాత): మంగళవారం మేడారం పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో మంత్రి సీతక్క రంగంలోకి దిగారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు ఆమె మేడారంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికార యంత్రాంగంతో పాటు సమ్మక్క సారలమ్మల పూజారులతో సమీక్ష చేపట్టారు.
మంగళవారం నాడు మేడారం అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేయనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులు చురుగ్గా చేపడుతుండగా… ఎలాంటి లోటుపాట్లు లేకుండా సీతక్క స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రతి విభాగానికి మార్గనిర్దేశం చేస్తూ, చేపట్టాల్సిన పనులపై ఆదేశాలు ఇస్తున్నారు.
ఎంగిలిపూల బతుకమ్మ పండుగ నాడు కూడా తన భాద్యతలను విస్మరించకుండా ఉదయం 10 గంటలకు మేడారానికి చేరుకున్న మంత్రి సీతక్క సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. ఆలయ ప్రాంగణంలో చేయాల్సిన మార్పులపై పూజారుల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వారి సూచనలను అధికారులు అనుసరించేలా చర్యలు చేపట్టారు.
మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేస్తారని.. అనంతరం అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.