CM Revanth Reddy | బిజీబిజీగా సీఎం రేవంత్ వరంగల్ పర్యటన

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో తొలిసారి చేపట్టిన పర్యటన శనివారం బిజీబిజీగా సాగింది. అభివృద్ధి పనుల ప్రారంభం ఏమీ లేకుండా పథకాల ప్రారంభం, పనుల ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించి ఆ పనులపై సమీక్షతో సాగింది.

  • Publish Date - June 29, 2024 / 03:19 PM IST

వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభం
టెక్స్‌టైల్‌ పార్కును పరిశీలించిన సీఎం
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పరిశీలన
వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష
సీఎంకు జిల్లా ప్రజా ప్రతినిధుల ఘన స్వాగతం

విధాత ప్రత్యేక ప్రతినిధి : ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో తొలిసారి చేపట్టిన పర్యటన శనివారం బిజీబిజీగా సాగింది. అభివృద్ధి పనుల ప్రారంభం ఏమీ లేకుండా పథకాల ప్రారంభం, పనుల ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించి ఆ పనులపై సమీక్షతో సాగింది. ముఖ్యంగా వరంగల్ నగర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక శ్రద్ధ వహించారు.

నా సొంత జిల్లా మహబూబ్నగర్ మినహా తొలిసారి జిల్లాల పర్యటన వరంగల్ నుంచి ప్రారంభం కావడం విశేషం. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. అనంతరం కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

అన్ని వసతులతో నూతన గ్రామ నిర్మాణం

వర్షపు నీటిని వృధాగా ఫోనీయకుండా పార్కులో ప్రత్యేకంగా ఒక పాండును నిర్మించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదేశించారు.ఈ నీటిని మొక్కలకు, స్థానిక అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా పక్కనే ఉన్న కుంటతో అనుసంధానం చేయాలని దీనివల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు గృహ నిర్మాణం కోసం ప్లాట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఫ్లాట్ తో పాటు ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణం చేయించి ఇచ్చే విధంగా చూడాలన్నారు.

ఇక్కడ ఒక నూతన గ్రామాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామంలో ప్రాథమిక వసతులన్నీ ఉండే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందించే అమలు చేయాలని సూచించారు. పార్క్ అభివృద్ధికి సంబంధించిన మిగతా విషయాలు జిల్లా కలెక్టరేట్లో జరిగే సమీక్ష సమావేశంలో మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

ఢిల్లీ నుంచి సరాసరి వరంగల్ కు

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఐదు రోజులు అక్కడ బిజీబిజీగా గడిచిన సీఎం రేవంత్ రెడ్డి శనివారం వరంగల్ కు హెలికాప్టర్లో వచ్చారు గీసుకొండ మండలం శాయంపేటలో ఏర్పాటు చేసిన మెగా టెక్స్‌టైల్‌ పార్కు చేరుకొని అక్కడ మొక్కలు నాటారు. వాస్తవానికి శుక్రవారం జరగాల్సిన సీఎం పర్యటన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఒకరోజు వాయిదా పడింది. తన పర్యటనలో భాగంగా టెక్స్‌టైల్‌ పార్కుతో పాటు సెంట్రల్ జైలు ఆవరణలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

తదుపరి మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఇప్పటివరకు సాగుతున్న ప్రాజెక్టులు, పనులకు సంబంధించినటువంటి ప్రగతిని సమీక్షించి నగరాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను ఈ సందర్భంగా సూచించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, సితక్క, పొంగులేటి, దామోదర రాజా నరసింహం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కడియం శ్రీహరి, నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, యశశ్విని రెడ్డి,గండ్ర సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన నేపథ్యంలో బీఆరెఎస్ తో పాటు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులను, రైతు ప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు

Latest News