Cold Wave | ఈ ఏడాది కుండపోత వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కారణంగా.. మొన్నటి వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇక వానల నుంచి ఉపశమనం లభించింది అనుకున్న క్రమంలో మళ్లీ నవంబర్ 17 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ కీలక అప్డేట్ ఇచ్చాడు. నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి వర్షాలు లేవని పేర్కొన్నాడు. ఆ తర్వాతే అల్పపీడనం, తుపాను ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఈ క్రమంలో డిసెంబర్ తొలి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నాడు. నవంబర్ 21వ తేదీ వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుందని, ఆ తర్వాతి రోజుల్లో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నాడు. మొత్తానికి నవంబర్ చివరి వర్షాల గురించి మరిచిపోండి అని బాలాజీ సూచించాడు. రాబోయే 10 నుంచి 12 రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపాడు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చలి కొనసాగుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పరిమితమవుతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో రహదారులపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
