విధాత, హైదరాబాద్ :
కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి తన జీవిత కాలమంతా దేశ ప్రజలను విప్లవానికి సమాయత్తం చేయడం కోసం బహుముఖాలుగా కృషి చేశాడని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకుడు వీకే పటోలే అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో విద్యార్థి దశలో ఆకర్షితుడై, తన ఇంజనీరింగ్ చదువును వదిలేసి కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తగా చేరారు. కర్నూలు జిల్లా నాయకుడై, ఆ తర్వాత నందికొట్కూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తదనంతరం ఎన్నికల ద్వారా వ్యవస్థ మారదని నమ్మి 52 సంవత్సరాల వయసులో తుపాకీ భుజాన వేసుకొని ములుగు అడవుల్లో విప్లవోద్యమాన్ని నిర్మించడానికి వెళ్లిన గొప్ప విప్లవ నాయకుడు చంద్ర పుల్లారెడ్డి అని వీకే పటోలే కొనియాడారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఏర్పాటు చేసిన కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి ఏరిన రచనలు పుస్తక ఆవిష్కరణ సభను ప్రారంభించారు. చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన అనేక రచనల్లోని ఎంపిక చేసిన భాగాలను ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ఆవిష్కరించడం గొప్ప విషయమని వీకే పటోలే కొనియాడారు. ప్రపంచంలో నేడు పాలస్తీనా లాంటి స్వతంత్ర దేశంపై ఇజ్రాయిల్.. అమెరికా మద్దతుతో దాడి చేయడానికి అందరూ వ్యతిరేకించాలన్నారు. ఇటీవలే న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన మాందాని.. జాత్యహంకారి నేతన్యాహును తమ రాష్ట్రానికి వస్తే అరెస్టు చేస్తామని ప్రకటించడం గొప్ప విషయం అన్నారు.
భారత ప్రజల్ని విప్లవానికి సన్నద్ధం చేయడానికి చండ్ర పుల్లారెడ్డి.. ఆదివాసి, అటవీ ప్రాంతాల్లో అజ్ఞాత జీవితాన్ని గడిపి పార్టీనీ 14 రాష్ట్రాలకు విస్తరించాడని గుర్తుచేశారు. విప్లవోద్యమం నేడు ఎన్నో ఎగుడు దిగుడులను ఎదుర్కొంటున్నప్పటికీ దానిని గోదావరి లోయలో ప్రతిఘటన పోరాటంగా తీర్చిదిద్దిన రూపశిల్పిగా పటోలే అభివర్ణించాడు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి తన జీవితకాలంలో అనుసరించి రూపొందించిన ప్రతిఘటన పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అవుతుందని పటోలే వెల్లడించారు.
అనంతరం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ.. దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మించడం కోసం చండ్ర పుల్లారెడ్డి అనేక రచనలు చేశాడన్నారు. అందులో “13 సంవత్సరాల ఉద్యమ సమీక్ష” అతి ముఖ్యమైనది అన్నారు. విప్లవోద్యమంలో అతివాద మితవాదాల ఎదుర్కొంటూ ప్రజల్ని ఉద్యమంలో నిలబెట్టడం కోసం ఆయన రచనలు ఈనాటి కమ్యూనిస్టు విప్లవ శ్రేణులకు ఎంతో అవసరమైనదని తెలిపారు. మావోయిస్టు పార్టీ నాయకుల్ని నేటి ప్రభుత్వాలు లొంగిపోతారా? కాల్చి చంపాలా? అంటూ అదే రీతిన ఆ పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని బూటకపు ఎన్‌కౌంటర్లో కాల్చి చంపడాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 21, 22 తేదీలలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేయాలని పార్టీ పిలుపునిస్తుందని తెలియజేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న మావోయిస్టు పార్టీ నాయకుల్ని కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. అడవిలో నుంచి బయటికి వస్తున్న వారిని కాల్చి చంపరాదని, ఈ ఎన్‌కౌంటరులపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో న్యూ డెమొక్రసీ పార్టీ జాతీయ నాయకుడు ఎస్.వెంకటేశ్వరరావు, పి.ప్రసాద్, జేవీ చలపతిరావు, బి ప్రదీప్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, టీ.సుధాకర్, ఆవునూరి మధు, IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి టీ. శ్రీనివాస్, POW జాతీయ కన్వీనర్ జీ.ఝాన్సీ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు K.గోవర్ధన్, POW జాతీయ నాయకురాలు వి.సంధ్య తదితరులు ప్రసంగించారు.
