విధాత, హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మరింత ఫోక్ పెంచింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా తెలంగాణపై కేంద్రీకరించారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత వరుసగా రెండు సార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అధికారాన్నిచేజిక్కించుకోవాలన్న దృడ నిర్ణయంతో ఉంది. ఈ మేరకు తెలంగాణ పై ప్రత్యేకంగా కేంద్రీకరించిన రాహుల్ గాంధీ వీలైనన్ని ఎక్కువ సార్లు ఇక్కడకు వస్తున్నాడు. తాజాగా ఈ నెల18,19,20 తేదీలలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయడానికి సిద్దమయ్యారు.
ఈ మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర రూట్ ఖరారు చేసే పనిలో ఉంది. ఈ బస్సు యాత్ర మొదటి రోజు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొననున్నారు. ఈ బస్సు యాత్రలో రాహుల్ గాంధీ సామాన్య ప్రజలతో ముచ్చటించనున్నారు. అక్కడక్కడ చౌరస్తాలో గ్రూప్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.
ఇలా అన్నా చెళ్లెళ్లు ఇద్దరు రాష్ట్రంపై కేంద్రీకరించారు. ఒక వైపు రాష్ట్రంలో పర్యటిస్తూనే, పార్టీ వ్యవహారాలను సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తున్నారు. టికెట్ల కేటాయింపుల్లో పైరవీలకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా గెలుపు గుర్రాలకే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో నియోజక వర్గంలో ఫ్లాష్ సర్వేలు నిర్వహించి, సర్వేల్లో సానుకూలంగా ఉన్న వారికే టికెట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు పలు కమిటీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను వడపోస్తోంది.