– 18 నుంచి బస్సు యాత్ర ప్రారంభం
– రాహుల్, ప్రియాంక గాంధీ రాక
– భారీ మహిళా బహిరంగ సభ నిర్వహణకు నిర్ణయం
– సెంటిమెంట్ గా మారిన ములుగు
– గతంలో మేడారం నుంచి రేవంత్ యాత్ర
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా కాకతీయుల గడ్డ ములుగు నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనుంది. ఈనెల 18న కాంగ్రెస్ పార్టీ తొలి విడత బస్సుయాత్ర చేపట్టేందుకు ముహూర్తం ఖరారు చేసింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ములుగు రామప్ప దేవాలయంలో శివుడికి పూజలు నిర్వహించి, అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ములుగులో భారీ మహిళా బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రాహుల్, ప్రియాంకతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే తొలి సభ కావడంతో అతిరథ మహారథులంతా పాల్గొననున్నారు.
ములుగు సెంటిమెంట్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరంగల్ జిల్లా ములుగు సెంటిమెంట్ గా మారిందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ములుగు నుంచి ప్రారంభించడంతో ఈ చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర స్పూర్తితో గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్ర ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల నుంచి ప్రారంభించారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ధనసరి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. రేవంత్ యాత్ర మేడారం నుంచి ప్రారంభం కాగా, ఇప్పుడు ఎన్నికల ప్రచారం ములుగు రామప్ప నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించడం విశేషం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ములుగు ఎమ్మెల్యే సీతక్క అత్యంత సన్నిహితురాలు కావడంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమమైనా చేవెళ్ళ నుంచి ప్రారంభించే వారు.
అప్పుడు చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. సబితను చేవెళ్ళ చెల్లెమ్మ అనే వారు. ఇప్పుడు రేవంత్ కూడా ములుగు సీతక్క నియోజకవర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారు. రేవంత్ కు ములుగు సెంటిమెంట్ గా మారినందున్నే జగిత్యాల జిల్లా కొండగట్టు నుంచి తొలుత ఈ బస్సుయాత్ర ప్రారంభించాలని భావించినప్పటికీ తర్వాత షెడ్యూల్లో మార్పు చేసి ములుగు రామప్పను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సీతక్కకు టికెట్ కూడా ఖరారు కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తక్కువ సమయం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యే సీతక్క జయప్రదం చేసేందుకు అప్పుడే సన్నాహాలు ప్రారంభించారు. ములుగు నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర భూపాల్ పల్లికి చేరుకుంటుంది. అక్కడ నిరుద్యోగులతో పాదయాత్ర చేపట్టిన అనంతరం రాత్రి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సింగరేణి ఏరియా పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా నిజామాబాద్ వరకు మూడు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించనున్నారు.