Site icon vidhaatha

మీ హయాంలోనే రైతు ఆత్మహత్యలు అధికం

congress

కేసీఆర్‌పై కాంగ్రెస్ ట్వీట్ ఫైట్‌

విధాత : రాష్ట్రంలో నెలకొన్న కరవు ప్రకృతి తెచ్చింది కాదని..కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరవు అని, కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో రైతులు 200మంది ఆత్మహత్యల పాలయ్యారని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస ప్రెస్‌మీట్లు..సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి చేస్తున్నారు. బీఆరెస్ హయాంలోనే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని, 2022లో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణలో దేశంలో నాల్గవ స్థానంలో ఉందని కాంగ్రెస్ ట్విటర్ వేదికగా ఆరోపించింది.

బీఆరెస్ పదేళ్ల పాలనలో రైతు ఆత్మహత్యలు లేవన్న కేసీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దు ఉంటుంది కేసీఆర్ అని, మీరు తెలంగాణ ప్రజలను అబద్దాలతో దశాబ్ద కాలం మోసం చేశారని, కాబట్టే మిమ్మల్ని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఇప్పటికైనా అబద్ధాలు మానేసి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన సమస్యలను లేవనెత్తండని హితవు పలికింది. అంతేకానీ మీ రాజకీయ స్వలాభాల కోసం రైతులను, తెలంగాణ ప్రజలను మోసం చేయకండని సూచించింది.

Exit mobile version