సాక్ష్యాలు సేకరిస్తున్నాం.. రాజకీయ నాయకులనూ విచారిస్తాం: సీపీ కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు.

  • Publish Date - April 26, 2024 / 02:50 PM IST

విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. ఈ కేసులో నిందితులంతా చాలా స్మార్ట్‌గా, ఇంటలిజెంట్‌గా వ్యవహరించారని తెలిపారు. తమ శక్తి మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించేలా ట్యాపింగ్‌ చేశారన్నారు.

వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించడం అనేది ఘోరమైన నేరమన్నారు. నలుగురు పోలీస్ ఆఫీసర్స్ ప్రమేయం ఉందని.. వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో మరి కొంత మంది పోలీసులను సాక్షులుగా పెట్టామన్నారు. సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశామన్నారు. ట్యాపింగ్ జరిగిందా లేదా అన్నది తేల్చే ఆధారాలతో పాటు నిందితులకు శిక్షపడేలా సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. తదుపరి దశలో అవసరమైతే రాజకీయ నాయకులను విచారిస్తామన్నారు.

కేసులో కీలకంగా ఉన్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని స్పష్టం చేశారు. ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనేది అవాస్తవమన్నారు. ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదని..అతను ఎక్కడున్నాడో ఇప్పటివరకు తెలియదని గాలింపు కొనసాగుతుందని చెప్పారు. అలాగే ప్రభాకర్ రావుపై ఎల్‌వోసీ జారీ చేసిన ఎల్‌వోసీ లైవ్‌లోనే ఉందన్నారు. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామన్నారు.

Latest News