Site icon vidhaatha

Kunamneni Sambasiva Rao : ఫిరాయింపులకు ఆజ్యం పోసింది బీఆర్ఎస్

Kunamneni Sambasiva Rao

విధాత వరంగల్ ప్రతినిధి: తెలంగాణలో ఫిరాయింపులకు ఆజ్యం పోసింది బీఆర్ఎస్ పార్టీయేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది ఎవరైనా వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ఏ పార్టీ వారైనా పార్టీ మారగానే సభ్యత్వం రద్దు చేయాలని, ఇందుకు పార్టీ ఫిరాయింపుల చట్టంలో అవసరమైన మార్పులు రావాల్సి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్పష్టమైనందున, ఈ అవినీతి పై నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఐ పై నమ్మకం పోయిందని, కేంద్రం కనుసన్నల్లో కాకుండా సీబీఐ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. హనుమకొండలో సోమవారం జరిగిన సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసేది కమ్యూనిస్టులేనని అన్నారు. నిత్యం ప్రజా జీవితంలో ఉండే కమ్యూనిస్టులకు ఎలాంటి మచ్చ ఉండని నిస్వార్థ పరులని అన్నారు. అందుకే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నా నేటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉందన్నారు. ఎన్నికలు ధన ప్రవాహంగా మారిపోయినా, మతోన్మాద శక్తులు ప్రజలను విభజిస్తున్నా వాటికి ఎదురొడ్డి సీపీఐ నిలబడిందన్నారు. ఈసీ, సీబీఐ లాంటి సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రశ్నించే వారిని అణిచివేసే చర్యలు బీజేపీ చేపడుతున్నదని అన్నారు. ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించడమే సురవరం కు నిజమైన నివాళి అని అన్నారు. ఈ నెల 11 నుండి 17 వరకు తెలంగాణా సాయుధ పోరాట వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, షేక్ బాష్ మియా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సీనియర్ నాయకులు టి. వెంకట్రాములు, మేకల రవి, సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, వలి ఉల్లా ఖాద్రి, టి.విశ్వేశ్వర్ రావు, మండ సదాలక్ష్మి, తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Exit mobile version