విధాత, వరంగల్ ప్రతినిధి: పేదవాడి ఓటు హక్కును హరించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సీపీఐ జనగామ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జనగామ లో జరిగింది. ఈ సమావేశానికి జువారి రమేష్ అధ్యక్షత వహించగా తక్కళ్లపల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదవాడిని పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర మంత్రి లలన్ సింగ్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశంలో పేదలను ఎన్నికలకు దూరం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని, పేదలంటే బీజేపీకి చిన్నచూపు అని అన్నారు. పేదలను ఓట్లు వేయనీయవద్దని చెప్పిన లలన్ సింగ్ ను కేంద్ర మంత్రి మండలి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్రం ఓటరు ప్రత్యేక జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించేందుకు సిద్ధమైందని అన్నారు. కేంద్రం ప్రభుత్వ కనుసన్నల్లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ను చేపట్టిందని, ఎస్ఐఆర్ ను రాజకీయ అస్త్రంగా ఉపయోగించి ఎన్నికలకు ముందు ఓటర్లను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఖమ్మం బహిరంగ సభకు తరలిరండి
డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే పార్టీ శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు జనగామ జిల్లా నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని జిల్లా కార్యదర్శి సి హెచ్. రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యురాలు పాతూరి సుగుణమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు జీడి ఎల్లయ్య,రావుల సదానందం,పాతూరి ప్రశాంత్, కావటి యాదగిరి,చొప్పరి సోమయ్య, జిల్లా సమితి సభ్యులు, మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
