సింగరేణి పరిరక్షణకు సీపీఐ(ఎం) రాష్ట్ర వ్యాప్త నిరసనలు

బొగ్గు బ్లాకుల వేలంపాటను రద్దు చేసి నేరుగా సింగరేణికే అప్పగించాలన్న డిమాండ్‌తో ఈనెల 28,29 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నట్లుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు

  • Publish Date - June 22, 2024 / 05:28 PM IST

బొగ్గుల బ్లాకుల వేలం రద్దు చేసి..సింగరేణికి కేటాయించాలి
రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

విధాత : బొగ్గు బ్లాకుల వేలంపాటను రద్దు చేసి నేరుగా సింగరేణికే అప్పగించాలన్న డిమాండ్‌తో ఈనెల 28,29 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నట్లుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ ధర్నాల్లో పాల్గొని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి పరిరక్షణ ఆకాంక్షను చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాళా తీయించే విధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ప్రారంభించిందని, . రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి, హైదరాబాద్‌లోనే ఈ ప్రక్రియ ప్రారంభించటం ఆందోళనకరమని విమర్శించారు. వేలం ప్రక్రియ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొనటం ఆశ్చర్యకరమని, ఒకవైపు బొగ్గు బ్లాకును వేలం వేస్తూ, మరొకవైపు సింగరేణిని ప్రైవేటీకరించబోము అని మంత్రి కిషన్‌రెడ్డి బుకాయిస్తున్నారన్నారు.

ఇది ఓట్లు వేసి గెలిపించిన తెలంగాణ ప్రజలను మోసం చేయటమేనని తమ్మినేని తప్పుబట్టారు. తక్షణం వేలంపాట రద్దు చేయాలనీ, రాష్ట్రంలో బొగ్గు తవ్వే సంస్థగా సింగరేణికే బొగ్గు బ్లాకులు అప్పగించాలనీ భారత ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్‌ చేస్తున్నదని తెలిపారు. బీఆరెస్‌ పాలనలో రెండు ప్రైవేటు సంస్థలకు కేంద్రం కట్టబెట్టిన రెండు బొగ్గు బ్లాకులు కూడా తిరిగి సింగరేణికే అప్పగించాలని సీపీం కోరుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర సంపదను ప్రయివేటు సంస్థలకు కట్టబెడుతున్నదని, రాష్ట్రంలో బీజేపీకి 8 పార్లమెంటు, 8 శాసనసభ స్థానాలిచ్చిన ప్రజలకు వీరు ఇస్తున్న బహుమానం ఇదేనా అని తమ్మినేని ప్రశ్నించారు. బొగ్గు బ్లాకులు ప్రైవేటుపరం అయిన తర్వాత సింగరేణి నష్టాలపాలై మూతపడే స్థితికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నెట్టుతున్నదని ఆరోపించారు. మరోవైపు సింగరేణి కూడా వేలంపాటలో ప్రైవేటు సంస్థలతో పోటీ పడాలని చెబుతున్నారని ఇందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధపడటం ఆందోళనకరమని తమ్మినేని పేర్కోన్నారు.

ఒకవైపు నేరుగా ఈ బొగ్గు బ్లాకులు సింగరేణికే అప్పగించాలని చెబుతూనే, మరోవైపు వేలంపాటలో పాల్గొనడానికి రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతిస్తున్నదని, వేలం పాటలో పాల్గొన్న తర్వాత, ఆ ప్రక్రియకు తలొగ్గటమే కదా! అని, వేలంపాటలో సింగరేణికి బొగ్గు బ్లాకు దక్కవచ్చు, దక్కకపోవచ్చని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు.సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా కేంద్రాన్ని డిమాండ్‌ చేయటం కాకుండా వేలంపాట రద్దు చేయాలనీ, సింగరేణికే బొగ్గు బ్లాకులు నేరుగా అప్పగించాలని కోరుతూ మోడీ ప్రభుత్వం మీద వత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని కూడగట్టి కేంద్రంతో చర్చించాలని, తెలంగాణ గుండెకాయ సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలను కదిలించాల్సిన అవసరముందన్నారు.

Latest News