Site icon vidhaatha

దళిత బంధు పథకం యూనిట్ల దారి మళ్లింపుపై చర్యలు : డిప్యూటీ సీఎం భట్టి

విధాత : దళిత బంధు పథకం యూనిట్లు దారి మళ్లితే చర్యలు తీసుకుని తిరిగి లబ్ధిదారులకు చేర్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వారం లోపల దారి మళ్లిన వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని రైతు వేదికలో దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించారు. చింతకాని మండలంలో అర్హులందరికీ దళిత బంధు మంజూరైనట్లు తెలిపారు. ఈ పథకంలో అమలులో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందన్నారు. మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన లబ్ధిదారులకు వారంలోగా రెండవ దశ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. దళిత బంధు పథకంలో చింతకాని మండలం శాచురేషన్ పద్ధతిలో ఎంపికైందని అన్ని గ్రామాలను ప్రత్యేక అధికారులు సందర్శించి లబ్ధి పొందిన వారిని గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. యూనిట్లు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా లేక దారి మళ్లాయా అన్నదానిపై విచారణ జరిపించాలన్నారు. ఇతరులకు అమ్మరా బదిలీ చేశారా గుర్తించి వాటిని వారంలోగా తిరిగి లబ్ధిదారులకు ప్రత్యేక అధికారులు అందించాలని తెలిపారు. ఈ పథకం కింద మంజూరైన యూనిట్లను అమ్మడం, బదిలీ చేయడం నేరమని స్పష్టం చేశారు. వందశాతం దళిత బంధు లబ్ధిదారులు యూనిట్ల ద్వారా వ్యాపారం చేయాల్సిందేనని, వారి వద్దనే వ్యాపారానికి కేటాయించిన యూనిట్లు ఉండాలని స్పష్టం చేశారు.

Exit mobile version