బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బ్యాంకర్లకు రుణ మంజూరీలో సామాజిక, మానవీయ కోణం ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి భట్టి హాజరయ్యారు

  • Publish Date - June 19, 2024 / 04:22 PM IST

శరవేగంగా హైదరాబాద్ అభివృద్ధి
త్వరలో కొత్త విద్యుత్తు పాలసీ
రైతులకు..పెద్దలకు రుణ పంపిణీలో బ్యాంకర్ల వివక్ష : మంత్రి తుమ్మల

విధాత, హైదరాబాద్‌ : బ్యాంకర్లకు రుణ మంజూరీలో సామాజిక, మానవీయ కోణం ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి భట్టి హాజరయ్యారు. బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించి మాట్లాడారు. బ్యాంకర్స్‌కు పాజిటివ్ దృక్పథం లేకపోతే వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేయూనందించకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామమని భట్టి చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ చుట్టు అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు.

వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తుందన్నారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు డిమాండ్ రాబోతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తమ మొదటి ప్రాధాన్యమని భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉందని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది ఉండదని తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతోందని భట్టి వెల్లడించారు.

రైతులకు రుణ పంపిణీలో బ్యాంకర్ల వివక్ష : మంత్రి తుమ్మల

బ్యాంకర్లు బహుళజాతి, ఇన్ఫ్రా కంపనీలకు వేలకోట్ల రుణాలు ఎలా ఇస్తున్నారని, అదే సమయంలో రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనుకడుగు వేస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు. దశాబ్దాలుగా రైతే రాజు అంటున్నామని, కానీ బ్యాంకు గణాంకాలు చూస్తే భయం వేస్తోందని పేర్కొన్నారు. పెద్దలకు ఒక న్యాయం..పేదలకు మరో న్యాయం ఉండకూడదన్నారు. నిబంధనల మేరకే బ్యాంకర్లు వ్యవహరించాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ పండించే రైతులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని తెలిపారు. . బహుళజాతి, ఇన్ఫ్రా కంపెనీలకు రూ.వేల కోట్ల రుణాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి మాత్రం బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయన్నారు.

Latest News