విధాత, హైదరాబాద్ : మూడో విడత రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు 15న మూడో వైరాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న బహిరంగ సభ ద్వారా ప్రారంభించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వైరాతో పాటు తన స్వగ్రామమైన స్నానాల లక్ష్మిపురంలో సుమారు 81.52కోట్లతో చేపట్టననున్న అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. వైరాలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైరా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రెండో దశ అమృత్ పథకం కింద 26.87కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ప్రతిపక్షాల నాయకులు అంతా కూడా భ్రమల్లో ఉండగానే రుణమాఫీ చేసి ప్రతిపక్షాలను కాంగ్రెస్ ఆశ్చర్యంలో ముంచెత్తిందని, రుణమాఫీపై ప్రతిపక్షాలు విసిరిన సవాల్ మేరకు ఆర్థిక మంత్రిగా ఆగస్టు 15న రుణమాఫీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రైతు రుణమాఫీ తొలి రెండు దశల్లో మొత్తం 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు 12 వేల 289 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో రుణ మాఫీ మాత్రమే కాదు.. రైతు భీమాకు 1500కోట్ల నిధులు పెట్టామని ఆయన తెలిపారు. మరోవైపు.. రైతుల ప్రీమియంను కూడా వైరా సభలోనే ప్రకటిస్తామన్నారు.
Hon’ble Deputy CM Sri Bhatti Vikramarka PressMeet || Vyraa https://t.co/f9qMRdhiVN
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) August 9, 2024
దీని ద్వారా 40 లక్షల కుటుంబాలకు ఉపయోగపడుతుందన్నారు. రూ.1350 కోట్లను రైతు పంటల భీమాను రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 72 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. ఉద్యానవన పంటలు, డ్రిప్, సింప్సన్‌కు ఆధునీకరణకు నిధులు మంజూరు చేశామన్నారు. రూ.1,450 కోట్లతో పూర్తి చేసే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ పేరు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం రూ.23 వేల కోట్లుకు పెంచి దోపిడీ చేసిందని ఆరోపించారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక ఎకరాకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల సమక్షంలో రివ్యూ చేశామన్నారు. తక్కువ ఖర్చుతో నీళ్ళు పారించే విధానంతో అతి తక్కువ ఖర్చుతో కేవలం రూ.75 కోట్లతో లక్షన్నర ఎకరాలు పండించేలా సీతారామ ప్రాజెక్ట్ లింకు కెనాల్‌తో పనులు చేశామన్నారు. ఎన్‌ఎస్‌పీ లింకు , వైరా కెనాల్‌కు లింకు కలపటమే రేపటి కార్యక్రమమని… ఇదీ మా నిబద్ధతకు తార్కాణం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తన స్వస్థలం వైరాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, వైరా రుణం తీర్చుకుంటానన్నారు. వైరా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సూతన తరగతి గదులు, ల్యాబ్‌ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేసి తనకు పంపాలని సూచించారు.