Site icon vidhaatha

MLA Mahipal Reddy | బీఆరెస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇళ్లపై ఈడీ దాడులు

341కోట్ల సీనరేజీ, ఫెనాల్టీ చెల్లించాలని మైనింగ్ శాఖ నోటీసులు

విధాత : పటాన్‌చెరు బీఆరెస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంటిపై ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది. ఉదయం 5 గంటల నుంచి పటాన్‌చెరులోని ఆయన నివాసంలో, సోదరులు, బంధువుల ఇళ్లలో మొత్తం మూడుచోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున పటాన్ చెరు చేరుకున్న 40మంది అధికారుల బృందం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూధన్‌రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అల్లుడు చంద్రశేఖర్, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు ఇద్దరు మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఓ కేసులో మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధు అరెస్ట్‌ కాగా ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. లక్డారం గనుల వ్యవహారంలో గతంలో పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో మధుసూదన్‌రెడ్డిపై కేసు నమోదయింది. దాని ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు చేసినట్లుగా సమాచారం. లక్డారంలోని ఎమ్మెల్యే ఫ్యామిలీ అక్రమ మైనింగ్‌పై స్థానికులతోపాటు పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ స్వయంగా ప్రధానికి గతంలో ఫిర్యాదు చేశారు.

అక్రమ మైనింగ్‌లో భారీగా అవకతవకలకు తెరలేపడంతో పాటు పెద్దఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిన్ననే మహిపాల్ రెడ్డి రూ.3 కోట్ల ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్ కారును కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది. తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు ఖరీదైన కారును గుర్తించడంతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో బీఆరెస్ నుంచి పార్టీ మారుతారన్న ఎమ్మెల్యేల జాబితాలో మహిపాల్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈడీ దాడులు సాగడం విశేషం.

సీనరేజీ, ఫెనాల్టీ 341కోట్లు చెల్లించాలని నోటీస్‌లు

గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ఇంటితో పాటు లక్తారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్ పరిశ్రమలో కూడా సోదాలు నిర్వహించిన ఈడీ పలు అక్రమాలను గుర్తించింది. సంతోష్ గ్రానైట్ పరిశ్రమకి యజమానిగా ఉన్న గూడెం మధుసూదన్ రెడ్డి భూగర్భగనుల శాఖకు భారీ మొత్తంలో సీనరేజిని ఎగవేసినట్టు ఈడీ రైడ్ లో తేలింది. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ ని తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించినట్టు బయటపడింది. సీనరేజి, పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డి రూ.3 వందల 41 కోట్లు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో గతంలో మధుసుదన్ రెడ్డి జైలుకి వెళ్లివచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు.

Exit mobile version