Site icon vidhaatha

సీఎంకు ఉద్యోగుల జేఏసీ జ్ఞాపిక

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (విధాత): రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం– 2025 అమలులోకి తీసుకురావడంతో పాటు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా జీపీవోలకు నియామక పత్రాలను అందించడం వలన గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ వీ లచ్చిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆనవాళ్ళు కోల్పోయిన రెవెన్యూ శాఖను పునర్నిర్మాణం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జేఏసీ, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, తెలంగాణ తాసిల్దార్స్‌ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

దేశంలో ఎక్కడా లేని సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను సృష్టించడం, రెవెన్యూ ఉద్యోగుల పదోన్నతులు కల్పించడంపై ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులందరం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించ్చేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వడం వలన గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు నిర్ణిత కాలంలో అందుతాయన్నారు.

రెవెన్యూ ఉద్యోగులకు అండగా ఉంటానని సీఎం చెప్పడంతో జీపీవోలతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. జీపీవోల నియామక పత్రాల అందజేత సభలో లచ్చిరెడ్డితోపాటు.. వివిధ సంఘాల నేతలు కే రామకృష్ణ, రాములు, పాక రమేశ్‌, బాణాల రామ్ రెడ్డి, భిక్షం, రాధ, పూల్ సింగ్, మల్లేష్, రాంబాబు, చైతన్య, సుజాత చౌహాన్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version