Site icon vidhaatha

Harish Rao | వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా.. క‌విత వ్యాఖ్య‌ల‌పై హ‌రీశ్‌రావు స్పంద‌న ఇలా..

Harish Rao | హైదరాబాద్ : కాళేశ్వ‌రం( Kaleshwaram ) ప్రాజెక్టులో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు( Harish Rao ) అవినీతికి పాల్ప‌డ్డ‌రంటూ ఎమ్మెల్సీ క‌విత( MLC Kavitha ) చేసిన వ్యాఖ్యల‌పై హ‌రీశ్‌రావు తొలిసారిగా స్పందించారు. లండ‌న్ ప‌ర్య‌ట‌న ముగించుకుని శ‌నివారం తెల్ల‌వారుజామున‌ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న హ‌రీశ్‌రావును మీడియా ప‌లుక‌రించ‌గా, ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 25 ఏండ్లుగా నా రాజ‌కీయ ప్ర‌స్థానం ఒక తెరిచిన పుస్త‌కం లాంటింద‌ని స్ప‌ష్టం చేశారు. క‌విత చేసిన వ్యాఖ్య‌ల‌ను వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాన‌ని చెప్పారు.

హ‌రీశ్‌రావు ఏం మాట్లాడారో.. ఆయ‌న మాటల్లోనే..

‘నా 25 ఏండ్ల రాజ‌కీయ ప్ర‌స్థానం తెలంగాణ ప్ర‌జ‌ల ముందు ఒక తెరిచిన పుస్త‌కం లాంటిది. స‌రే గ‌త కొంతకాలంగా మా పార్టీపైన, అదే విధంగా నాపైన కొన్ని రాజ‌కీయ పార్టీలు చేస్తున్న‌టువంటి వ్యాఖ్య‌ల‌నే వారు కూడా చేయ‌డం జ‌రిగింది. అయితే ఆ వ్యాఖ్య‌లు వారు ఎందుకు చేశారో.. అది వారి విజ్ఞ‌త‌కే నేను వ‌దిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయ‌క‌త్వంలో గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాల కాలంగా ఒక క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌గా, రాష్ట్ర సాధ‌న‌లో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబ‌ద్ధ‌త, నా పాత్ర అంద‌రికీ తెలిసిన‌టువంటిదే. ఈ రోజు రాష్ట్రంలో ఎరువులు దొర‌క‌క రైతులు ఓ వైపు గోస ప‌డుతున్నారు. మ‌రొక వైపు వ‌ర‌ద ప్రాంతాల ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు ద‌శాబ్ద కాలం ఎంతో క‌ష్ట‌ప‌డి నిర్మించిన వ్య‌వ‌స్థ‌ల‌ను, ఇటువంటి ప‌రిస్థితుల్లో క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఆదుకునే విష‌యంలో తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విష‌యంలో మా దృష్టంతా ఉంటుంది. మేం ఈ రాష్ట్ర సాధ‌న‌లో పోరాటం చేసిన వాళ్లం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవ‌డంలో బాధ్య‌త క‌లిగిన వాళ్లం. సో మా స‌మ‌యాన్ని అంతా కూడా దాని మీద‌నే వెచ్చిస్తాం. త‌ప్ప‌కుండా కేసీఆర్ గారి నాయ‌క‌త్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుని ఈ ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాల‌ను తొల‌గించ‌డానికి అంద‌రం క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగుతాం’ అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

 

Exit mobile version