Site icon vidhaatha

Telangana | అప్పులే స‌ర్కారుకు స‌మ‌స్య‌!.. హామీల అమ‌లు ఎలా?

త‌క్ష‌ణంగా రూ. 50 వేల కోట్లు అవ‌స‌రం
తీవ్ర ఒత్తిడిలో రేవంత్ స‌ర్కారు!
భూముల ధ‌ర‌లు పెంచితే భూమ్ రంగ్ అవుతుందా?

విధాత‌: బీఆరెస్ స‌ర్కార్ చేసిన అప్పులు రేవంత్ ప్ర‌భుత్వ‌ మెడ‌కు చుట్టుకున్నాయి. వ‌చ్చే ఆదాయం అప్పుల కిస్తీల‌కు, ఉద్యోగుల జీతాల‌కే అధిక భాగం పోతున్న‌ది. మిగిలిన సొమ్ము రోజువారీ ఖ‌ర్చుల‌కే స‌రిపోని ప‌రిస్థితి.. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్పెష‌ల్ డ్రాయింగ్‌, వేస్ అండ్ మీన్స్‌, ఓవ‌ర్ డ్రాప్ట్‌ల ప‌ద్ధ‌తిలో రుణాలు తీసుకుంటున్న‌ది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు రూ. 20 వేల కోట్ల వ‌ర‌కు రుణాలు తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సాధార‌ణ ఖ‌ర్చుల‌కే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డితే ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డానికి నిధుల స‌మీక‌ర‌ణ చేయ‌డం అన్న‌ది రేవంత్ స‌ర్కారు ఎదుర‌వుతున్న‌ అస‌లు స‌మ‌స్య‌? .

కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసే నాటికి రాష్ట్ర ప్ర‌భుత్వ అప్పు రూ.6.72 ల‌క్ష‌ల కోట్లు ఉన్న‌ది. ఈ అప్పుకు రుణ వాయిదాల కింద ప్రభుత్వానికి వ‌చ్చే ఆదాయంలో 34 శాతం చెల్లింపులు చేస్తున్న‌ది. మ‌రో 35 శాతం వేత‌నాల కోసం ఖ‌ర్చు చేస్తోంది. మిగ‌తా ఆదాయంతోనే బండిని క‌ష్టంగా న‌డుపుతున్నారు. ఆదాయం కంటే అధికంగా పెరిగిన అప్పులే నేడు రాష్ట్ర‌ ఖ‌జానాకు భారంగా మారాయి. జీఎస్‌డీపీలో దాదాపు 45 శాతం వ‌ర‌కు అప్పులు ఉన్న‌ట్లు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి నుంచి గ‌ట్టేక్కాలంటే అద‌న‌పు ఆదాయ వ‌న‌రుల‌పై కేంద్రీక‌రించాల్సిందేన‌ని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.

రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే పార్ల‌మెంటు ఎన్నిక‌లు వ‌చ్చాయి. దీంతో పాల‌నా వ్య‌వ‌హారాలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీక‌రించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. పార్ల‌మెంటు ఎన్నిక‌లు ముగిశాయి… పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌జ‌లు త‌మకు ఇచ్చిన రుణ‌మాఫీని ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల్లో రుణ‌మాఫీపై పెరుగుతున్నఅసంతృప్తిని గుర్తించిన రేవంత్ రెడ్డి ఆగ‌స్ట్ 15 న రుణ‌మాఫీ చేస్తాన‌ని ఇది త‌న హామీగా ప్ర‌క‌టించారు. ఇచ్చిన హామీని అమ‌లు చేయ‌క‌పోతే ప్ర‌జ‌లు న‌మ్మ‌డం క‌ష్ట‌మ‌ని తెలిసిన రేవంత్ ఎన్నిక‌ష్టాలు ఎదురైనా రుణమాఫీ అమ‌లుచేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో పాటు పంట‌ల బోన‌స్‌, రైతు పెట్టుబ‌డి స‌హాయం రైతు భ‌రోసాను కూడా త‌క్ష‌ణంగా అమ‌లు చేయాల్సిన అనివార్య ప‌రిస్థితి ఈ ప్ర‌భుత్వానికి ఏర్ప‌డింది.

రుణ‌మాఫీతో పాటు ఇత‌ర ఆర్థికహామీలు అమ‌లు చేయాలంటే రేవంత్ రెడ్డి స‌ర్కారుకు త‌క్ష‌ణంగా రూ. 50 వేల కోట్ల వ‌ర‌కు నిధులు అవ‌స‌రం అవుతాయి. ఒక్క రైతు రుణ‌మాఫీకే దాదాపు రూ. 40 వేల కోట్లు కావాలి. దీనికితోడు ఇత‌ర ప‌థ‌కాలు, హామీలు ఉండ‌నే ఉన్నాయి. వీటికి కావాల్సిన నిధుల‌ను స‌మీకర‌ణే రేవంత్ రెడ్డి అస‌లు ప‌రీక్ష‌. దీంతో రేవంత్ ఆదాయ వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌పై అధికారులు, అందుబాటులో ఉన్నమంత్రుల‌తో సుదీర్ఘంగా స‌మీక్ష నిర్వ‌హించారు. నిధుల స‌మీక‌ర‌ణ‌కు భూముల అమ్మ‌క‌మే మార్గంగా ఎంచుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే భూముల ధ‌ర‌ల పెంపు, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల స‌వ‌ర‌ణతో పాటు జీఎస్టీ, ఇత‌ర ప‌న్నులు నిక్క‌చ్చిగా వ‌సూలు చేయ‌డం ద్వారా స‌మీక‌ర‌ణ చేయ‌వ‌చ్చున‌ని అధికారులు స‌ల‌హాలు ఇచ్చిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

రాష్ట్రంలో ఇప్ప‌టికే రియ‌ల్ ఎస్టేట్‌రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న‌ది. ఒక్క హైదాబాద్‌లోని దాదాపు 20 ల‌క్ష‌ల అపార్ట్‌మెంట్లు అమ్ముడు పోకుండా ఉన్నాయ‌ని స‌మాచారం. భూముల క్ర‌య‌విక్ర‌యాలు కూడా తగ్గిన‌ట్లు రియ‌ల్ ఎస్టేట్‌వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలాంటి ప‌రిస్థితిలో భూముల రేట్లు పెంచితే ఎలా? అన్న చ‌ర్చ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార\వ‌ర్గాల‌లో జ‌రుగుతోంది. కాగా రియ‌ల్ ఎస్టేట్ రంగం పుంజుకోకపోతే ఆదాయ స‌మీక‌ర‌ణపై కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉందంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో క్ర‌య‌విక్ర‌యాలు పెరిగే విధంగా ఉండాలి కానీ రేట్లు పెంచ‌డం స‌రికాద‌న్న అభిప్రాయం కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

ధ‌ర‌లు పెంచ‌డం క‌న్నా… ఆదాయం పెర‌గ‌డానికి ప్ర‌ధానంగా పెట్టుబ‌డిదారులు, వ్యాపారుల న‌మ్మ‌కాన్నిఈ ప్ర‌భుత్వం చూర‌గొనాల్సి వ‌స్తుంద‌న్న చ‌ర్చ కూడా ఉన్న‌ది. ప్ర‌ధానంగా రియ‌ల్ ఎస్టేట్‌రంగం పుంజుకోవ‌డానికి ప్ర‌ధానంగా నిర్మాణ అనుమ‌తులు, భూమి మార్పిడి అనుమ‌తులు వేగంగా రావాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని అంటున్నారు. భూమిపై న‌మ్మ‌కాన్ని క‌ల్పించాల‌ని అడుగుతున్నారు. గ‌త ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణిలో అనేక లోపాల కార‌ణంగా అనేకమంది భూములు అమ్ముకోలేని, కొనుక్కోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనిని స‌రిదిద్ద‌డంతో పాటు భూ య‌జ‌మాన్య హ‌క్కులు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఉదాహార‌ణ‌కు హైద‌రాబాద్ చుట్టూ శివారు ప్రాంతాల్లోని అనేకగ్రామాల్లో చాలా భూములు ఏవో చిన్న లిటిగేష‌న్‌తో రిజిస్ట్రేష‌న్ కాకుండా ఉన్నాయి. ఇలాంటి వాటిని స‌రిచేస్తే ఒక్కసారి రియ‌ల్ భూమ్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుందని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార వ‌ర్గాలు చెపుతున్నాయి. దీంతో పాటుగా ప‌న్నుల వ‌సూళ్లు పార‌ద‌ర్శ‌కంగా ఉండేలా చూడాలంటున్నారు. పైగా గ‌తంలో చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు త‌గ్గించే మార్గాలు చూడ‌టం ద్వారా కొంత ఉప‌శ‌మ‌నం పొంద వ‌చ్చున‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు వెళితేనే ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితి నుంచి కొంత ఉప‌శ‌మ‌నం పొందుతూ ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేయ‌డానికి చేయి ఆడుతుంద‌న్న అభిప్రాయం ఆర్థిక నిపుణ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. వీట‌న్నింటికి స‌మ‌తూకం వేసుకొని ప‌రిపాల‌న సాగించ‌డం రేవంత్‌కు ఒక స‌వాలేన‌ని అంటున్నారు.

Exit mobile version