Adharva / Hyderabad News / 18 July 2025
Heavy Rains Hit Hyderabad | హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభమైన భారీ వర్షం నిరంతరాయంగా కురుస్తూ నగర జీవనాన్ని అల్లకల్లోలం చేసింది. బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎల్బీనగర్, మియాపూర్, కూకట్‌పల్లి, మలక్‌పేట్, చంచల్‌గూడ, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో రోడ్లు నదుల్లా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు కాలనీలు జలమయం అయ్యి, పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి వచ్చాయి. కొన్నిచోట్ల వాహనాలు వరద నీటిలో చిక్కుకోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మియాపూర్, ప్రగతినగర్, అమీర్‌పేట్, బేగంపేట్, పంజాగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, కోఠి, చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. సికింద్రాబాద్, అల్వాల్, మారేడ్‌పల్లి, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తీవ్రం అయ్యాయి. ఉప్పల్ స్టేడియం నుంచి హబ్సిగూడ వరకు వరద నీరు రాకపోకలకు పెద్ద ఆటంకం కలిగించింది. యూసఫ్‌గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు తెరుచుకోవడం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నాచారం భవానీనగర్‌లో మోకాలి లోతు వరద నీరు ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తోంది.
భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో పోలీసులు స్వయంగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వర్షం కారణంగా రహదారులపై వాహనాల క్యూలు ఎక్కువయ్యాయి. GHMC మానిటరింగ్ టీమ్స్ లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించి సహాయక చర్యలు చేపడుతున్నాయి. కొన్ని ఇళ్లలో వర్షపు నీరు చేరిందని స్థానికులు వాపోతున్నారు. వాతావరణ శాఖ రాబోయే 24 గంటల్లో కూడా హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అధికారులు పౌరులకు విజ్ఞప్తి చేస్తూ, అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 040–29555500 నంబర్లను సంప్రదించవచ్చని GHMC తెలియజేసింది.