విధాత, హైదరాబాద్ : నీ భర్త ఐపీఎస్, నువ్వు ఐఏఎస్ గా ఉన్నారని.. అందుకే కళ్ళు నెత్తికెక్కి దివ్యాంగుల పట్ల అనుచితంగామాట్లాడుతున్నారని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా తన కూతురితో పాటు దివ్యాంగుడైన కంచర్ల భూపాల్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్ సర్వీసుల్లో దివ్యాంగులను పరిగణలోకి తీసుకోరాదంటూ స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఓ అధికారిగా ఉండి.. రాజ్యాంగ వ్యతిరేకంగా అలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. స్మితా సబర్వాల్ దివ్యాంగులకు జన్మనిచ్చి ఉంటే వారి కష్టాలు ఏంటో ఆమెకు తెలిసేవని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దివ్యాంగులను అవహేళన చేసి వారి మనో ధైర్యాన్ని దెబ్బతిసేలా కుట్ర చేస్తున్న స్మితా సబర్వాల్ మెంటల్ గా అన్ ఫిట్ అని, ఐఏఎస్‌గా పనికి రాదని, వెంటనే ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డిమాండ్ చేశారు. ఎన్నో ఆటుపోట్లను కష్టనష్టాలను ఎదుర్కొని బాలలత లాంటి ఓ దివ్యాంగ మహిళ ఐఏఎస్ కాగలిగారని, తనతో పాటే ఎంతోమందిని ఐఏఎస్‌లుగా తయారు చేసేందుకు ఐఏఎస్ అకాడమీ ద్వారా ఎంతోకృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. బాలలత లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి దివ్యాంగులనే హేళన చేయడం సరి కాదన్నారు. ప్రపంచమే గర్వించదగ్గ ఎంతోమంది దివ్యాంగులు ఉన్నారని, అటువంటి వారిని అవమానించడం సరికాదని ఆయన హితవు పలికారు.
Kancharla Bhupal Reddy | కళ్లు నెత్తికెక్కి దివ్యాంగులను అవమానిస్తున్నారు … ఐఏఎస్ స్మితా సభర్వాల్‌పై మాజీ ఎమ్మెల్యే కంచర్ల ఫైర్
