Smita Sabharwal | స్మితా సభర్వాల్​కు ఉన్నత న్యాయస్థానం ఊరట

కాళేశ్వరం కేసులో ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని కోర్టు ఆదేశాలు. సీబీఐ దర్యాప్తుకు సిద్ధమవుతోంది.

Smita Sabharwal Gets Relief in Kaleshwaram Case – Telangana High Court Stay on Ghosh Commission Report

Smita Sabharwal | తెలంగాణలో అత్యంత వివాదాస్పదమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్​కు  హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆగస్టు 2025లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘోష్ కమిషన్ నివేదికలో, స్మితా సభర్వాల్‌తో సహా 19 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో తొమ్మిదేళ్లు పనిచేసిన ఆమె కాళేశ్వరం ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చిన విధానాన్ని కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పర్యవేక్షించిన ఫోటోలు, జిల్లా అధికారుల ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా తీసుకొని, అక్రమాలకు అవకాశం కల్పించారని నివేదిక ఆరోపించింది.

అయితే, నివేదిక రూపకల్పనలో తాను వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదని, చట్టబద్ధమైన 8(బి), 8(సి) నోటీసులు ఇవ్వకుండా చర్యలు సిఫారసు చేయడం చట్టవిరుద్ధమని స్మితా సభర్వాల్ వాదించారు. నివేదికను “ప్రక్రియ దుర్వినియోగం – అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్(Abuse of Process)” అని ఆమె అభివర్ణించారు.

స్మితా సభర్వాల్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని ఆదేశించినప్పటికీ, కాళేశ్వరం అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్‌ను కూడా పరిశీలిస్తామని తెలిపింది. నివేదికలో సేకరించిన వివరాలను కావాలని ఎంపిక చేసుకుని వాడుకున్నారని, ప్రాజెక్టుకు అనుమతులు చట్టబద్ధంగానే ఇచ్చానని ఆమె స్పష్టం చేశారు. తనపై చర్యలు రాజకీయ దురుద్దేశ్యాలతోనే జరుగుతున్నాయని కూడా ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇకపోతే, కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు, అవినీతి అంశాలపై సీబీఐ దర్యాప్తుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ప్రస్తుతం సీబీఐ దీనిపై ప్రాథమిక సన్నాహాలు చేసుకుంటోంది.

Latest News