Medaram : మేడారంలో నలుగురు మంత్రుల పర్యటన

శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026కు సంబంధించిన అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి అనసూయ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మేడారంలో పర్యటించారు.

Medaram

విధాత, వరంగల్ ప్రతినిధి : ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలో బుదవారం నలుగురు మంత్రులు పర్యటించారు. మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ ప్రాంగణానికి హెలికాప్టర్ లో చేరుకున్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సి,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,మహబూబాబాద్
పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు కు
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. శబరిష్ పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.

– వనదేవతలను దర్శించుకున్న మంత్రులు

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ లు దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మలకు మంత్రులను దగ్గరుండి మొక్కలు సమర్పించుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వనదేవతల పూజారులు పాల్గొన్నారు.

– అభివృద్ధి పనుల పరిశీలన

సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేడారంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ లో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు అధికారులు స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనుల్లో చేపట్టాల్సిన మార్పులు చేర్పులను సూచించారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సాగుతున్న ఒక్కో పని వివరాలు పరిశీలించగా అధికారులు వివరించారు.

– పనుల పురోగతిపై సమీక్ష

మేడారం లోని హరిత హోటల్ లో శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 నిర్వహణపై ఉన్నత అధికారులతో మంత్రులు సమీక్షించారు. ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రగతి, రాబోయే రోజుల్లో పనిని సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సీరియస్ గా చర్చించారు. జాతర సమయం దగ్గర పడుతున్నందున పనులను జాతరలోపు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నందున తగిన శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన ఇన్చార్జిలు కూడా పాల్గొన్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.