విధాత, హైదరాబాద్ :
తెలంగాణలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల హాస్టల్ లో కలుషిత ఆహారం తినడంతో 15మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం హాస్టల్ లో విద్యార్థులు అల్పహారంగా ఉప్మా పెట్టారు. అయితే, అందులో పరుగులు వచ్చినట్లు గుర్తించిన విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కు చెప్పారు. దీంతో ఉప్మాను పడేసి వారికి బెస్కెట్లు, అరటిపండ్లు అల్పాహారంగా ఇచ్చారు. తరగతి గదులకు వెళ్లిన విద్యార్థుల్లో కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
గద్వాల ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో నిత్యం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు ఆవేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ సంక్షేమ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయట పెట్టింది అని తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. విద్యా శాఖ స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నా వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
