Harish Rao| విద్యార్థులు ఆసుపత్రిలో..సీఎం ఫుట్ బాల్ ఆటలో: హరీష్ రావు ఫైర్

రాష్ట్రంలో గురుకుల పాఠశాల విద్యార్థులు వరుసగా కలుషిత ఆహారంతో అసుపత్రుల పాలవుతుంటే...రాష్ట్రానికి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి అవేమి పట్టనట్లుగా ఫుట్ బాల్ ఆటలో బిజీగా ఉన్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు మండిపడ్డారు. బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పరామర్శించారు.

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో గురుకుల పాఠశాల విద్యార్థులు వరుసగా కలుషిత ఆహారంతో అసుపత్రుల పాలవుతుంటే…రాష్ట్రానికి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి అవేమి పట్టనట్లుగా ఫుట్ బాల్ ఆటలో బిజీగా ఉన్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, రాహుల్ గాంధీ(Rahul Gandhi) పర్యటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.61 సార్లు ఢిల్లీకి పోవడానికి, ఫుట్ బాల్ ఆడటానికి రేవంత్ రెడ్డికి టైం ఉంది కానీ ఆసుపత్రి పాలయిన విద్యార్థులను పరామర్శించడానికి టైం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. మెస్సితో ఫుట్ బాల్ ఆడేందుకు మేస్త్రి 100 కోట్లు ఖర్చు చేస్తున్నాడని, 5 కోట్లతో స్టేడియం కట్టించుకున్నాడని..పిల్లలకు మాత్రం నాణ్యమైన తిండి పెట్టడం లేదు అని విమర్శించారు. ఆ డబ్బుతో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. నీ కబ్జాలకు, నీ సోకులకు, నీ కమిషన్లకు టైం సరిపోవడం లేదు.. ఇంక నువ్వు విద్యార్థులను ఎలా పట్టించుకుంటావని రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.

రైజింగ్ కాదు..పాయిజన్ విజన్

అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రేవంత్ సర్కార్ పై ఫిర్యాదు చేసే దుస్థితి నెలకొందని హరీష్ రావు ఆవేదన వెలిబుచ్చారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నానని రేవంత్ రెడ్డి అంటున్నాడని, అప్పటివరకు పిల్లలు బతికుండేది ఎట్లా అని ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా గురుకుల విద్యార్ధుల ఆసుపత్రుల పాలవుతున్నప్పటికి ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదు అన్నారు. ఏనాడు కూడా ఆసుపత్రి పాలైన విద్యార్థులను పరామర్శించలేదు అని విమర్శించారు. రేవంత్ రెడ్డిది విజన్ 2047 కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్ 2047 అని, ప్రచార ప్రకనల్లో తెలంగాణ రైసింగ్ .. హాస్పిటల్స్ లో విద్యార్థులు ఫాలింగ్ అని ఎద్దేవా చేశారు. అవినీతిలో రైసింగ్. అరాచకంలో రైసింగ్. అహంకారంలో లేక కబ్జాలో రైసింగ్ అని దుయ్యబట్టారు.​విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. త్రీ ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెప్పడం కాదు.. ముందు హాస్టల్ పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టండని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీకి ఫుట్ బాల్ మ్యాచ్ పై ఉన్న శ్రద్ద ప్రజా సమస్యలపై ఏది ?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫుట్ బాల్ మ్యాచ్ మీద ఉన్న శ్రద్ధ.. చనిపోతున్న రైతులు, విద్యార్థుల మీద లేదు అని హరీష్ రావు ఆరోపించారు. ఆరు గ్యారెంటీలకు నాది జిమ్మెదారి అన్న రాహుల్ గాంధీ ఎటు పోయిండు? అని, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ గాంధీ రాడు అని, 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాడు అని, 116 మంది విద్యార్థులు చనిపోతే రాడు అని, 42% రిజర్వేషన్ కోసం బీసీలు పోరాటం చేస్తున్నా రాడు అని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ముఖం చాటేసి, ఈరోజు ఫుట్ బాల్ చూడడానికి మాత్రం రాహుల్ గాంధీ వస్తున్నాడని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చి రేవంత్ రెడ్డి ఆడే ఫుట్ బాల్ ఆట చూసి పరవశిస్తాడట అని ఎద్దేవా చేశారు. గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం తిని ఆగమైతుంటే, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగే తెలివి, బాధ్యత రాహుల్ గాంధీకి లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు వస్తున్న రాహుల్ గాంధీకి ఏ మాత్రం బాధ్యత ఉన్నా.. ముందుగా ​కలుషిత ఆహారంతో కడుపునొప్పి భరించలేక ఏడుస్తున్న విద్యార్థుల కన్నీళ్లు చూడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Latest News