Site icon vidhaatha

Kedrai conference | స్థిరాస్తి వ్యాపారులకు ప్రభుత్వ సహకారం.. కేడ్రాయ్‌ సదస్సులో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌లు

విధాత, హైదరాబాద్ : స్థిరాస్తి వ్యాపారులకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, తెలంగాణ అభివృద్ధి, బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎన్‌. ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ స్టేట్‌కాన్- 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు హాజరై మాట్లాడారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో యువరాజు ప్రభుత్వం మాత్రమే ఉండేదన్నారు. మీకు పనులు కావాలంటే ఆ ప్రభుత్వంలో కేవలం ఇద్దరిని మాత్రమే కలిస్తే సరిపోయేదన్నారు. అందులో ఒకరు ఫామ్ హౌస్ లో ఉంటే.. ఇంకొకరు విదేశాల్లో సెల్ఫీలు దిగడం, ఫొటోలకు పోజులు ఇవ్వడం సరిపోయేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు అలా కాదని.. ఎవరైనా ఎప్పుడైనా మీ సమస్యలు తమ దృష్టి కి తీసుకురావొచ్చని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. క్రెడాయ్ సమస్యలు నేరుగా మాకు చెప్పొచ్చన్నారు. గత సర్కారు ఆరు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిందని.. వేల కోట్ల కాళేశ్వరం కూలి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదన్నారు. తెలంగాణలో నిర్మాణ రంగం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఒక్క హైదరాబాద్‌కే కాకుండా ఇది జిల్లాలకు వ్యాప్తి చెందిందన్నారు. ఇవాళ ఓఆర్ఆర్‌కు ఇంత పేరు వచ్చిందంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముందు చూపే కారణమన్నారు. గతంలో చంద్రబాబు డెవలప్మెంట్ ను హైటెక్ సిటీకే పరిమితం చేశారని.. దీన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లారన్నారు. ఓఆర్ఆర్ కంటే అద్భుతంగా ట్రిపుల్ ఆర్ టెండర్లు పిలవబోతున్నామని కోమటిరెడ్డి అన్నారు. సిటీ ఒకే వైపు కాకుండా సౌత్ సైడ్ కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం మరో మైలురాయి వంటిదన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా చేస్తామన్నారు.

మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ క్రెడాయ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో పోటీ పడుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. నగరానికి కృష్ణ, గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత, మెట్రో నిర్మించిన ఘనత కాంగ్రెసేదేనని ఉత్తమ్ గుర్తు చేశారు. ఇప్పటికే 40శాతం పట్టణీకర జరిగిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన తెలిపారు.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. అత్యధికంగా బిల్డర్స్ , కార్మికులు, ఉన్న అసోసియేషన్ క్రెడాయ్ అని అనిల్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు తలమానికంగా ఓఆర్ఆర్ ఉందన్నారు. త్వరలో మూసీ ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరగనుందన్నారు. మూసీ అండ్ ఈసా నదులపై బఫర్ సమస్యలు ఉన్నాయన్నారు. హైడ్రా నేపథ్యంలో అనుమతులకు సంబంధించి ముందు జాగ్రత్త వహించాలన్నారు.

 

 

Exit mobile version